Site icon HashtagU Telugu

Ganja – Donkey : గాడిదల పెంపకం ముసుగులో గంజాయి దందా.. ఇలా దొరికారు

Ganja Donkey

Ganja Donkey

Ganja – Donkey : పేరుకు గాడిదల పెంపకం చేపట్టారు. దాని  మాటున గంజాయిని విక్రయించారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.  ఈ దందాను నడుపుతున్న ముఠాను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.  వారి నుంచి 130 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ప్రేమ్ కుమార్ నగరానికి వలస వచ్చి జీడిమెట్ల ప్రాంతంలో ఉంటున్నాడు. రాజస్థాన్‌కే చెందిన జైసింగ్ భాటి,ప్రేమ్ కుమార్, రూప్ చంద్ అనే మరో ముగ్గురు వ్యక్తులు కూడా జీడిమెట్లలోని సుభాష్ నగర్‌లో నివసిస్తున్నారు. జై సింగ్ జీడిమెట్ల సమీపంలోని సుభాష్ నగర్ లో ఫుడ్ కోర్ట్, మెదక్ జిల్లా కూచారాల్లో గాడిదల ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. జై సింగ్ దగ్గర ప్రేమ్ కుమార్ పని చేసేవాడు. ఈక్రమంలోనే జై సింగ్, ప్రేమ్ కుమార్ కలిసి.. మంగీలాల్, ధర్మేంద్రల ద్వారా గంజాయి కొని కాలేజీ విద్యార్థులకు అమ్మేవాడు. జీడిమెట్లలోని నూడుల్స్ సెంటర్‌తో పాటు మెదక్ జిల్లా కూచారంలోని డంకీ ఫామ్ కేంద్రంగా గంజాయి దందా నడిచేది. ఎక్కువ మొత్తంలో గంజాయి కావాలని మంగిలాల్, ధర్మేంద్రలను కోరగా.. వారు రాజమండ్రికి చెందిన రాజన్‌ను సంప్రదించాలని సూచించారు. రాజమండ్రికి వెళ్లి బొలెరో,స్విఫ్ట్ కార్లలో గంజాయిని  హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా మార్గం మధ్యలో  పోలీసులు అడ్డుకొని.. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు(Ganja – Donkey) తరలించారు.

We’re now on WhatsApp. Click to Join.

అరకు నుంచి గంజాయి.. హైదరాబాద్‌లో సేల్

గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా రాయినపల్లికి చెందిన కొంకర బ్రహ్మయ్య నాయుడు, జోగులాంబ గద్వాల జిల్లా రాజులకు చెందిన తెలుగు రమేష్ 6 నెలల క్రితం నగరానికి వచ్చారు. నగరంలో జొమాటో, ర్యాపిడో బాయ్స్‌గా పని చేస్తున్నారు. ఈజీ మనీ కోసం  అరకు ప్రాంతానికి చెందిన నారాయణ నుంచి గంజాయి కొని నగరంలో అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. గత శనివారం అరకు వెళ్లిన వీరు.. 9 కేజీల గంజాయిని ప్రైవేట్ బస్సులో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి నగరంలో కస్టమర్లకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో వీరు చేస్తున్న దందా బండారం బయటపడింది. హైదరాబాద్‌లో గంజాయి సేల్స్ పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Also Read: India With Palestine : గాజాలో పిల్లలు, మహిళల మరణాలపై భారత్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version