Site icon HashtagU Telugu

Ganja Racket : ఆంధ్రా – ఒడిశా బార్డర్‌ నుంచి తెలంగాణకు గంజాయి.. గుట్టుగా సప్లై

Ganja Racket Andhra Odisha Border Sileru To Warangal District Telangana Andhra Pradesh

Ganja Racket : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి దందా చాపకింద నీరులా సీక్రెట్‌గా కొనసాగుతోంది. ఆంధ్రా – ఒడిశా బార్డర్ ఏరియాల నుంచి తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాలకు గంజాయి చేరుతోంది. ఇందుకోసం ప్రధానంగా రైలు మార్గాన్ని స్మగ్లర్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.  ఆంధ్రా – ఒడిశా బార్డర్‌ ఏరియాలోని సీలేరు నుంచి తొలుత వరంగల్‌కు, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని చేరవేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం స్మగ్లర్లు రైలు రూట్లను, విభిన్న రోడ్డు మార్గాలను వాడుకుంటున్నారు.

రైల్వే రూట్‌లో స్మగ్లింగ్..  

సీలేరు నుంచి భద్రాచలం వరకు రైలు మార్గంలో 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం మధ్యలో ఉన్న ప్రాంతమంతా ఏపీ పోలీసుల పరిధిలోకి వస్తుంది. భద్రాచలం నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు 139 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం మధ్యలో ఉన్న ప్రాంతమంతా తెలంగాణ పోలీసుల పరిధిలోకి వస్తుంది. ఈ రెండు రూట్లలోనూ సాధారణ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటారు. ఈ తనిఖీల క్రమంలో చాలాసార్లు గంజాయి ముఠాలను పోలీసులు(Ganja Racket) పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే పోలీసులు 28 నెలల్లో రూ.11.58 కోట్లు విలువచేసే 45.98 క్వింటాళ్ల గంజాయి, హాష్‌ ఆయిల్, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరకముందే.. 

ఇంతలా తనిఖీలు జరుగుతున్నా పోలీసుల కళ్లు కప్పి.. వివిధ రైళ్లలో గంజాయిని వరంగల్, హైదరాబాద్ నగరాలకు స్మగ్లర్లు చేరవేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే రైళ్లు  వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.ఈ స్టేషను రాకముందే ఖమ్మం రోడ్ బ్రిడ్జ్ వద్ద ట్రైన్ స్లో అవుతుంది. స్మగ్లర్లు అక్కడే దిగి, సరుకును చేర్చాల్సిన చోటుకు చేరవేస్తున్నారు. ఇక ప్యాసింజర్ రైళ్లలో ఏపీ వైపు నుంచి వరంగల్‌కు వచ్చే స్మగ్లర్లు.. వరంగల్ కంటే ముందున్న చిన్న స్టేషన్‌లోనే దిగిపోతున్నారు. అక్కడి నుంచి ఆటోలు, బైక్‌లలో గంజాయిని అడ్డాల వద్దకు తరలిస్తున్నారు.

Also Read :Sita Navami 2025: ఈరోజే సీతా నవమి.. పూజ ఎలా చేయాలి ? దీన్ని ఎందుకు జరుపుకుంటారు ?

రోడ్డు మార్గంలో స్మగ్లింగ్.. 

గంజాయి స్మగ్లర్లు తొలుత తమ సరుకును ఏపీలోని సీలేరు నుంచి భద్రాచలం వద్దకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి మణుగూరు మీదుగా ములుగు జిల్లా ఏటూరునాగారం వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి ములుగు, వరంగల్, భూపాలపల్లి ఏరియాలకు తరలిస్తున్నారు. దీంతోపాటు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల ఏరియాలకు సరుకును తీసుకెళ్తున్నారు.  అక్కడి నుంచి ములుగు జిల్లా వెంకటాపురం, ఏటూరునాగారం మీదుగా వరంగల్‌ వైపునకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇంకోవైపు భద్రాచలం, ఇల్లెందు మీదుగా బయ్యారం, మహబూబాబాద్‌ ఏరియాలకు సరుకును తరలిస్తున్నారు. భద్రాచలం, ఇల్లెందు నుంచి ఖమ్మం జిల్లా మీదుగా మరిపెడ, తొర్రూరుకు సరుకును చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్తున్నారు. ఇక మరో రూట్ విషయానికొస్తే.. మహబూబాబాద్‌ జిల్లా గంగారం, కొత్తగూడ నుంచి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు సరుకును చేరవేసి, అక్కడి నుంచి రాత్రిపూట వరంగల్‌కు తరలిస్తున్నారు.