Gangster Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి వాస్తవ్యుడు. బీఆర్ఎస్ పాలనా కాలంలో 2016 ఆగస్టు 8న నయీంను పోలీసులు షాద్‌నగర్ వద్ద ఎన్‌కౌంటర్ చేశారు. అతడు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వ్యవహారం అప్పట్లో తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల ఆస్తులను అతడు కూడబెట్టాడనే చర్చ జరిగింది. బినామీల పేరిట కొన్ని ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరిట కొన్ని ఆస్తులను నయీం రిజిస్టర్ చేయించాడనే టాక్ ఆనాడు వినిపించింది. నయీం ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత.. తమను అతడు బెదిరించి ఆస్తులను బలవంతంగా లాక్కున్నాడంటూ ఎంతోమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని విచారించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా దాదాపు 250 కేసులు నమోదు చేశారు. 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు నయీం పాల్పడినట్లు నిర్ధారించారు.
Also Read :Aghori Weds Varshini: అఘోరీతో మ్యారేజ్.. వర్షిణి సంచలన కామెంట్స్
2020 మార్చి నుంచే ఈడీ ఫోకస్..
2020 మార్చిలో నయీం ఆస్తులపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అప్పటి ఐటీ అధికారులు, సిట్ అందించిన సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. నయీం తన ఆస్తులను కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్ , ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్‌ల పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్‌లో నమోదు నమోదు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వేల ఎకరాల భూములను, వందల నివాస భవనాలను నయీం అక్రమంగా సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి.
కొత్త అప్‌డేట్ ఇదీ..
తాజాగా ఈ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. నయీంకు(Gangster Nayeem) సంబంధించిన 35 ఆస్తులను జప్తు చేసింది. 35 ఆస్తులను నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరిట రిజిస్టర్ చేయించాడని గుర్తించింది. అవన్నీ ఇతరుల నుంచి అక్రమంగా, బలవంతంగా లాక్కున్న ఆస్తులేనని ఈడీ వర్గాలు అంటున్నాయి. నయీం కుటుంబసభ్యుల పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని తాజాగా ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఎన్ని సార్లు సమన్లు ఇచ్చినా నయీం కుటుంబ సభ్యులు స్పందించడం లేదని కోర్టుకు తెలిపారు. తమ నోటీసులకు స్పందించని వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టుకు ఈడీ అధికారులు విన్నవించారు. ఈడీ రిక్వెస్ట్ పై కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.