Bodybuilding Vs Steroids : అతి తక్కువ సమయంలో ఎక్కువ స్థాయిలో శారీరక దృఢత్వాన్ని పొందేందుకు కొందరు యువత స్టెరాయిడ్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండా ఎడాపెడా స్టెరాయిడ్లను తీసుకుంటున్నారు. దీనివల్ల కొన్నేళ్లలోనే వారి ఆరోగ్యాలు గుల్లబారుతున్నాయి. జిమ్ సెంటర్లకు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకొని కొన్ని ముఠాలు ఈ స్టెరాయిడ్లను సేల్ చేస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది.
Also Read :Suriya Emotional: తండ్రి మాటలకు సూర్య ఎమోషనల్.. రియాక్షన్ ఇదీ
ముఠా గుట్టురట్టు
తాజాగా వరంగల్ నగరంలోనూ ఈ తరహా గ్యాంగ్ ఒకటి బయట పడింది. వరంగల్‌లోని మంగళికుంట డాక్టర్స్ కాలనీ –2 మార్కండేయ వీధికి చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్ హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని ఓ జిమ్‌లో గత ఐదేళ్లుగా జిమ్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే జిమ్‌లో బాడీ బిల్డింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో శ్రావణ్‌కు ప్రశాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ సూచన మేరకు శ్రావణ్ స్టెరాయిడ్లను వాడటం మొదలుపెట్టాడు. అవే స్టెరాయిడ్లను బాడీ బిల్డింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న యువకులకు విక్రయించడం మొదలుపెట్టాడు. చివరకు దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. నిందితుడు శ్రావణ్ కుమార్‌పై కాస్మొటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ 1940 సెక్షన్ 18 ప్రకారం కేసు నమోదు చేశారు. మిగతా నిందితులను తొందర్లోనే పట్టుకుంటామని ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. శ్రావణ్ కుమార్ నుంచి రూ.20వేల విలువైన స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్, మణికంఠ, ఆనంద్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
బాడీ బిల్డింగ్‌కు స్లెరాయిడ్లు వాడితే..
- బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్(Bodybuilding Vs Steroids) వాడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
- నరాలు, కండరాల వ్యాధులు వచ్చే రిస్క్ ఉంటుంది.
- ఊపిరితిత్తుల వ్యవస్థను స్టెరాయిడ్స్ దెబ్బతీసే ముప్పు ఉంటుంది.
- కాలేయం పనితీరుకు స్టెరాయిడ్స్ విఘాతం కలిగిస్తాయి.
- శరీరంలోని జీవ క్రియల్లో ఆకస్మిక మార్పులు జరుగుతాయి.
- చివరగా కిడ్నీలు ఫెయిలయ్యే పెద్ద గండం చుట్టుముడుతుంది.
- మానసిక సమస్యలు సైతం తలెత్తే అవకాశం ఉంటుంది.