Site icon HashtagU Telugu

Electoral Bonds Data : ఎలక్టోరల్‌ బాండ్ల కు కేరాఫ్ గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ..?

Megha

Megha

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) గురించే చర్చ నడుస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు Ssupreme Court) రీసెంట్ గా ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీలకు (Political Parties) నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ (SBI) సమర్పించిన డేటాను ప్రజలకు తెలియజేసేలా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒకరోజు ముందే ఈ వివరాలను అప్‌లోడ్ చేసింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://www.eci.gov.in/candidate-politicalparty)లో అప్‌డేట్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ వివరాల ఫై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున బాండ్లు అందజేసిన వాటి వివరాలు తక్కువగా చూపించిందని ఆరోపిస్తున్నారు.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 వరకు రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందినట్లు తెలుస్తుంది. వీటిలో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ (Future Gaming) తో పాటు మేఘా ఇంజినీరింగ్ సంస్థ Megha Engineering) టాప్ లో ఉంది.

అసలు ఎలక్టోరల్ బాండ్ల అంటే ఏంటి..? దీనికి రాజకీయ పార్టీలకు సంబంధం ఏంటి..? ఎందుకు దీనిపై సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది..? దేశ వ్యాప్తంగా ఎందుకు ఇంత చర్చ నడుస్తుంది..? తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు (Political Parties) కూడా ఇందులో భాగస్వాములైన..? అసలు ఏందీ ఇది అంత..? అనేది క్లియర్ గా చూద్దాం.

ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) అంటే ఏంటి..?

ఎలక్టోరల్ బాండ్స్.. వ్యక్తులు లేదా సంస్థలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆర్థిక పరికరంగా పని చేస్తాయి. రాజకీయ పార్టీలకు నిధుల సహకారం కోసమే ఈ బాండ్‌లను ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది. ఇలాంటి వాటినే ఎలక్టోరల్‌ బాండ్‌ అంటారు. వీటిని రూ.1,000, రూ.10,000, రూ.1 లక్ష, రూ.10 లక్షలు, రూ.1 కోటి గుణిజాలలో విక్రయించబడతాయి. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి. విరాళాల రూపంలో వచ్చిన ధనంతో ఆయా పార్టీలు ప్రభుత్వాలు నడిపించడం చేస్తాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నడిపిస్తూ..కొత్త పథకాలను ప్రవేశ పెడుతూ వాటిని రన్ చేస్తుంటాయి.

ఈ బాండ్లకు ఎవరు అర్హులు అంటే..!

ఎలక్టోరల్ బాండ్ అనేది కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ మాత్రమే. భారతదేశానికి చెందిన కొందరు, అలాగే కంపెనీల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగిస్తుంటారు. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ లో మొదటి సారి ప్రవేశ పెట్టారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పని చేస్తుంది. అయితే, ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక, ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించడానికి అర్హులు. బాండ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందిస్తారు. బాండ్‌పై దాత పేరు ఉండదు దాని వివరాలు బ్యాంకు వద్ద మాత్రమే ఉంటాయి. ఈ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు బాండ్లను కొనుగోలు చేస్తుంటారు.

మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది. ఈ బాండ్ల కోసం IT చట్టంలోనూ, ప్రజాప్రాతినిథ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎలక్టోరల్‌ బాండ్స్‌కు విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (SBI) ఈసీకి ఆదేశాలు ఇచ్చింది. పారదర్శకత కోసం ఈ వివరాలను ప్రజల ముందు ఉంచాలన్నదే తమ అభిమతమని ఈసీ తెలియజేసింది.

ఈసీ వివరాల ప్రకారం పార్టీలకు భారీ విరాళాలు ఇచ్చిన టాప్ 10 దాతలు వీరే…

ఎక్కువ మొత్తం ఇచ్చిన ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ (Future Gaming) పేరు ఇప్పుడు మారుమోగిపొతుంది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ చిన్న ‘షటర్’ ఉన్న కంపెనీ రూ. 1368 కోట్లు వివిధ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఏమిటని సోషల్ మీడియాలో అంత మాట్లాడుతున్నారు. ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన శాంటియాగో మార్టిన్‌ది. ఈయననే అత్యధికంగా రూ.2,455.20 కోట్లను విరాళంగా ఇచ్చాడని తెలుస్తోంది.

దేశంలో లాటరీ సేల్స్ లీగల్‌గా జరుగుతున్న 13 రాష్ట్రాల్లో మార్టిన్ బిజినెస్ చేస్తూ నిత్యం కోట్లు ఆర్జిస్తున్నారు. గతంలో ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈడీ రైడ్స్ చేసింది. అప్పుడు దాదాపు రూ.603 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన అత్యధికంగా బీజేపీ పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు ఆరోపణలతో సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది.

ఇక రెండోది మేఘా ఇంజినీరింగ్ (Megha Engineering) సంస్థ :

తెలుగు రాష్ట్రాల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు రెండో స్థానంలో నిలువడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీలకు 966 కోట్ల రూపాయల విరాళాలు అందించడం ద్వారా ఆ సంస్థ టాప్ 2లో నిలవగా, తెలుగునాట ఎక్కువ విరాళాలు తీసుకున్న పార్టీగా BRS నిలిచింది. ఈ పార్టీకి ఏకంగా 12 వందల కోట్ల రూపాయలు విరాళాలు అందినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉండే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీని షార్ట్ ఫామ్ లో మెయిల్ (Meil) అని కూడా పిలుస్తారు. చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ, ప్రధానంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎక్కువగా చేస్తోంది.

కృష్ణా జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన పామిరెడ్డి పిచ్చి రెడ్డి 1989లో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. పిచ్చిరెడ్డి బంధువు పురిటిపాటి వెంకట కృష్ణా రెడ్డి ఆ సంస్థకు ఎండీగా ఉన్నారు. పది మంది కంటే తక్కువ మందితో మొదలైన సంస్థ గత ఐదేళ్లలో బాగా విస్తరించింది. మేఘా ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్‌గా మొదలై, 2006లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మారింది. ఇప్పుడు ఈ సంస్థ తెలుగు రాష్ట్రాలను దాటి, దేశవ్యాప్తంగా విస్తరించింది.

తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రధాన భాగం ఈ కంపెనీయే నిర్మించింది. అలాగే మహారాష్ట్రలోని థానే-బోరివలి జంట టన్నెల్స్ ప్రాజెక్టు, దాదాపు రూ.14 వేల కోట్ల విలువైనది కూడా మేఘా చేతుల్లోనే ఉంది.

ముంబై మెట్రొపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) నిర్మించ తలపెట్టిన థానే-బోరివలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ప్యాకేజీలను కూడా మేఘా సంస్థ దక్కించుకున్నది. ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజ కంపెనీ అయిన ఎల్ అండ్ టీని బిడ్డింగ్‌లో ఓడించి.. రూ.14,400 కోట్ల ప్రాజెక్టును మేఘా సంస్థ తమ ఖాతాలో వేసుకున్నది. ఈ ఏడాది జనవరిలో థానే-బోరివలి మధ్య టన్నెల్ నిర్మాణానికి సంబంధించి రెండు ప్యాకేజీల కోసం టెండర్లను పిలిచారు. ఈ టన్నెల్ నిర్మాణం వల్ల థానే, బోరివలి మధ్య ప్రస్తుతం ఉన్న 60 నిమిషాల ప్రయాణ సమయం 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిపోనున్నది. ప్రయాణ దూరం తగ్గడం వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు కూడా తక్కువగా కలుస్తాయని ఎంఎంఆర్డీఏ అంచనా వేసింది.

రెండు భారీ టన్నెల్స్‌కు సంబంధించి మేఘా, ఎల్ అండ్ టీ మాత్రమే సాంకేతికంగా అర్హత సాధించాయి. దీంతో తుది ఫైనాన్షియల్ బిడ్లను ఏప్రిల్‌ 25న తెరిచారు. ప్యాకేజీ 1కు సంబంధించి మేఘా, ప్యాకేజీ 2కు సంబంధించి ఎల్ అండ్ టీ తక్కువ కోట్ చేశాయి. అయితే ప్యాకేజీ 2కు సంబంధించి ఎల్ అండ్ టీ తక్కువ కోట్ చేసినా అధిక మొత్తంలో ట్యాక్స్‌లు చూపించడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు.

అలాగే మేఘ సాగునీరు, రవాణా, పవర్.. ఇలా ఆ సంస్థ అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు ఉన్నట్టు ఆ సంస్థ చెప్పుకుంది. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ కూడా వీరిదే. బర్గుండీ ప్రైవేట్, హురూన్ ఇండియా అనే రేటింగ్ సంస్థల ప్రకారం, స్టాక్ మార్కెట్లో లిస్టు కాని, భారతదేశపు టాప్ 10 మోస్ట్ వాల్యూబుల్ కంపెనీలలో మూడవ స్థానం మేఘాకు వచ్చింది. అలాగే బయటి పెట్టుబడులు లేని, అంటే బూట్ స్ట్రాప్డ్ కంపెనీలో దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఎన్నికల సంఘం తెలిపిన మేఘ లెక్కల్లో చాల తేడాలు ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెద్ద ఎత్తునే డబ్బు అందజేసినట్లు తెలుస్తుంది. కాకపోతే ఆ పెద్ద అమౌంట్ లెక్కలు చూపించకుండా తక్కువ లెక్కలు చూపించిందని ఆరోపిస్తున్నారు.

మేఘా తరువాత డాక్టర్ రెడ్డీస్ 80 కోట్లు, ఎన్సీసీ కంపెనీ 60 కోట్లు, నాట్కో ఫార్మా 57 కోట్లు, దివీస్ ల్యాబ్స్ 55 కోట్లు, రామ్కో సిమెంట్స్ 54 కోట్లు విరాళాలు ఇచ్చాయి. ఇది కాక తెలుగు నాట దాదాపు 30 వరకూ కంపెనీలు, పాతిక మంది పైగా వ్యక్తులు ఈ ఎలక్టోరల్ బాండ్లలో డబ్బు సమర్పించారు. ఆ జాబితాలో సిమెంట్ కంపెనీలు, ఫార్మా-రియల్ ఎస్టేట్ మొదలు కోవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ లాంటి సంస్థలున్నాయి. వీటిల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంస్థలు ఎక్కువగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బీజేపీ అత్యధికంగా బాండ్ల ద్వారా విరాళాలు పొందినట్లు తెలుస్తుంది. బీజేపీ మొత్తం రూ.6 వేల కోట్లు తీసుకుంది. ఇది మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో దాదాపు సగం. బీజేపీ తరువాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ రూ.1,600 కోట్లు, కాంగ్రెస్ పార్టీ రూ.1400 కోట్లు తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా నాల్గవ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ తరువాత ఏడవ స్థానంలో వైసీపీ 337 కోట్లు, 8వ స్థానంలో టీడీపీ 219 కోట్లు, 15వ స్థానంలో జనసేన 21 కోట్లు విరాళాలు తీసుకున్నాయి. ఒక్క సీపీఎం మాత్రం ఈ ఎన్నికలు బాండ్లను తిరస్కరించింది. తమ పార్టీ దీనికి వ్యతిరేకం అని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఈ ఎన్నికల బాండ్ల ద్వారా తీసుకోలేదు.

ఎలక్టోరల్ బాండ్ల సేకరణ ఫై కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేసారు. ఎలక్టోరల్ బాండ్ల విధానంతో బీజేపీ నాలుగు రకాలుగా అవినీతిని పాల్పడిందని రమేష్ ఆరోపించారు. ”ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, దర్యాప్తు సంస్థల బెదిరింపుల కారణంగా బాండ్లు కొనుగోలు చేసిన వారు, కాంట్రాక్టులు పొందడానికి లంచంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు, షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినవారు” మాత్రమే నాలుగు కేటగిరీలుగా ఉన్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావనిలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని.. ప్రజాకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. 2019 నుండి బీజేపీకే అత్యధికంగా రూ.6,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి” అని తెలిపిన ఆయన.. ఈ ఎలక్టోరల్ బాండ్ల డేటా బీజేపీకి చెందిన 4 రకాల అవినీతి విధానాలను బహిర్గతం చేసిందని ఆరోపించారు.

Read Also : Kishan Reddy: దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి