Site icon HashtagU Telugu

KTR Vs Congress : హామీలు నెరవేర్చనందుకు రాహుల్, ప్రియాంక క్షమాపణ చెప్తారా ? : కేటీఆర్

Ktr Tweet Congress Guarantees Full Page Advertisements

KTR Vs Congress : ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని ఆనాడు వార్తాపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ హామీల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదని ఆయన విమర్శించారు.  అప్పట్లో స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కనీసం ప్రజలకు మొహం చూపించే పరిస్థితిలో లేరన్నారు. ‘‘300 రోజుల కాంగ్రెస్ పాలనా కాలంపై ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ, కార్యకర్త కానీ తెలంగాణ ప్రజలకు సమాధానం  చెప్పగలరా ?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. హామీలన్నీ నెరవేర్చనందుకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక వచ్చి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తారా ? అని ఆయన నిలదీశారు. ఈమేరకు ఇవాళ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు.

Also Read :Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చే మిషన్.. మరో కీలక పరిణామం

ఇటీవలే అమృత్‌ టెండర్ల అంశంపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.  సీఎం బావమరిదికి చెందిన శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్‌ కట్టబెట్టారని ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 11, 13 సెక్షన్లను సీఎం రేవంత్ ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. సీఎం బావమరిదితో లీగల్‌ నోటీసులు పంపితే భయపడతానని అనుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మూసీ సుందరీకరణ కోసం మొన్న రూ.50వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ.1.50లక్షల కోట్లు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్‌ గగ్గోలు పెట్టింది’’ అని ఆయన ధ్వజమెత్తారు.  మూసీ ప్రాజెక్టుతో నిల్వ చేసే టీఎంసీలు ఎన్నిఅని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం కూల్చివేతలు తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మొత్తం మీద వరుస ట్వీట్లతో రాష్ట్ర సర్కారుపై(KTR Vs Congress) కేటీఆర్ విరుచుకుపడుతున్నారు.