BITS Hyderabad : మన గుండె స్పందనలు నిర్దిష్ట స్థాయుల్లో ఉండాలి. ఒకవేళ వాటిలో తేడాలు వస్తే.. అలర్ట్ కావాలి. కొన్ని రకాల వ్యాధుల కారణంగా గుండె స్పందనల్లో తేడాలు వస్తుంటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ మార్పు చాలా డేంజరస్. ఇలాంటి పరిస్థితుల్లో గుండె స్పందనలను కంట్రోల్‌లో ఉంచడానికి పేస్‌మేకర్ అనే పరికరాన్ని శరీరంలో అమరుస్తారు. ఇలా పేస్‌మేకర్‌లను అమర్చుకున్న వారి కోసం తెలంగాణలోని బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల టీమ్ లిథియం అయాన్ బ్యాటరీ అక్కరలేని ‘ఫ్యూయల్ సెల్’ను తయారు చేసింది. లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ఖర్చు చాలా ఎక్కువ. బిట్స్ హైదరాబాద్ పరిశోధకులు తయారు చేసిన ఫ్యూయల్ సెల్ ఖర్చు చాలా తక్కువ. దీన్ని ఎలక్ట్రో కార్బన్ వస్త్రంతో తయారు చేశామని ప్రొఫెసర్ సంకేత్ గోయల్, పరిశోధక విద్యార్థి వన్మతి వెల్లడించారు. దీని తయారీకి వంద రూపాయల్లోపే ఖర్చవుతుందని తెలిపారు. ‘ఫ్యూయల్ సెల్’ తయారీతో ముడిపడిన వివరాలతో తాము రాసిన రీసెర్ఛ్ పేపర్ ‘మైక్రో మెకానిక్స్, మైక్రో ఇంజినీరింగ్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో పబ్లిష్ అయిందని వారు పేర్కొన్నారు.
Also Read :Women Security : భార్యలను వదిలేస్తున్న ప్రవాస అల్లుళ్లకు చెక్.. ఎన్‌ఆర్‌ఐ సెల్ తడాఖా
బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల కథనం ప్రకారం.. గుండె పరిసర ప్రాంతాల్లో రక్తప్రసరణ ద్వారా లభించే శక్తితో పేస్‌మేకర్లలోని ఫ్యూయల్ సెల్(BITS Hyderabad) సగటున 60 రోజుల నుంచి 90 రోజుల దాకా పనిచేస్తుంది. తాము జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌లో ఈవిషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. జంతువుల్లో అమర్చిన పేస్‌మేకర్‌లోని ఫ్యూయల్ సెల్ 90 రోజుల తర్వాత పనిచేయడం ఆపేసిందన్నారు. దీంతో దాన్ని తీసి, మరో ఫ్యూయల్ సెల్‌ను వేశామన్నారు. సాధారణంగానైతే పేస్‌మేకర్‌ను ఒకసారి శరీరంలో అమరిస్తే.. దాని గడువు పూర్తయ్యాకే బయటకు తీస్తారు. ఆ విధంగా కాకుండా శరీరం బయటి నుంచే మళ్లీ పేస్ మేకర్‌ను అమర్చే టెక్నాలజీపై రీసెర్చ్ చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
Also Read :Aurobindo : ‘అరబిందో’ ఔట్.. 108, 104 సర్వీసుల నిర్వహణకు గుడ్‌బై ?
పేస్ మేకర్ ఇలా పనిచేస్తుంది..
పేస్ మేకర్ అనేది చిన్నపాటి ఎలక్ట్రానిక్ పరికరం. ఇది అరిథ్మియా వ్యాధిగ్రస్తుల శరీరంలో ఇమిడిపోతుంది. గుండె స్పందనలు సరిగ్గా ఉండేలా కంట్రోల్ చేస్తుంది. పేస్‌మేకర్‌లో పల్స్ జనరేటర్, ఇన్సులేటెడ్ లెడ్స్ అనే రెండు భాగాలు ఉంటాయి. పల్స్ జనరేటర్ ఓ చిన్న లోహపు డబ్బాలా ఉంటుంది. దీనిలో అతి చిన్న ఎలక్ట్రానిక్ చిప్, 7 ఏళ్ల పాటు పనిచేయగల బ్యాటరీ ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఓ చిన్న కంప్యూటర్‌లా పనిచేస్తాయి. ఇది గుండె స్పందన వేగాన్ని గమనించి తగినన్ని సార్లు కొట్టుకునేందుకు అవసరమైన విద్యుత్ ప్రేరణలను పంపిస్తుంది. ఫలితంగా గుండె తగినన్ని సార్లు కొట్టుకుంటుంది.