ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో వారు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స చేయించుకుని లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఆ దంపతులు OI, IUI సహా దాదాపు 12 సంతాన సాఫల్య ప్రక్రియలు చేయించుకున్నప్పటికీ విజయవంతం కాలేదు. గత ఏడాది గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించిన ఈ దంపతులను పరీక్షించిన వైద్యులు ఐవీఎఫ్ చికిత్సను సూచించారు.
డాక్టర్లు శోభ, ఫాతిమా పర్యవేక్షణలో నిర్వహించిన చికిత్స మొదటి ప్రయత్నంలోనే విజయవంతమై గర్భం దాల్చారు. మే 27న గాంధీ ఆస్పత్రిలో సుమారు 3.6 కిలోల బరువున్న పండంటి బాబు జన్మించాడు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్స, గర్భధారణ సమయంలో అవసరమైన పరీక్షలు, మందులు, ప్రసవం వరకు మొత్తం వైద్య సేవలను గాంధీ ఆస్పత్రి పూర్తిగా ఉచితంగా అందించినట్లు వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో భారీ ఖర్చులు భరించలేని వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యమైన ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు.
