New High Court: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మాణం శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి (New High Court) శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఇక్కడి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి, ఆయన వెంట వచ్చిన న్యాయవాదులు ప్రస్తుత నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
Also Read: Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్
వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఉన్న భవనం వారసత్వ కట్టడం అని, ఈ కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ భవనాన్ని పునరుద్ధరించి సిటీ కోర్టు లేదా ఇతర కోర్టు సముదాయాలను నిర్మించేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో కోర్టు సముదాయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేయాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.