ACB Questions : ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది. లండన్ కేంద్రంగా పనిచేసే ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈఓ) కంపెనీకి రూ.55 కోట్లను చెల్లించిన వ్యవహారంలో విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది. ఈక్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఇవాళ ఏసీబీ ప్రశ్నించింది. గత మూడు గంటలుగా ఆయనను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్ చెబుతున్న సమాధానాలను ఏసీబీ సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఏసీబీ ఆఫీసర్లు అడిగిన పలు ప్రశ్నలకు అరవింద్ కుమార్ కీలక సమాచారంతో కూడిన సమాధానాల్ని ఇచ్చారని తెలిసింది. ఆనాడు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినందు వల్లే ఎఫ్‌ఈఓ కంపెనీకి నగదును బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెప్పారని సమాచారం. అధికార వర్గాల సమాచారం ప్రకారం అరవింద్ కుమార్‌ను ఏసీబీ అడిగిన కొన్ని ప్రశ్నలను ఈ కింద చూడొచ్చు.
Also Read :KTR Vs ACB : కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. ఓఆర్ఆర్ టెండర్లలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపణ
అరవింద్ కుమార్‌ను ఏసీబీ అడిగిన ప్రశ్నలివే..
- రూ.55 కోట్లను ఎఫ్‌ఈఓ కంపెనీకి(ACB Questions) బదిలీ చేసే నిర్ణయం ఎవరిది ?
- నిధుల బదిలీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతులు రాలేదు.. అలాంటప్పుడు ఎఫ్‌ఈఓ కంపెనీకి ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేశారు ?
- రూ.55 కోట్లు పెద్ద అమౌంటు.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లేకుండా అంత పెద్ద మొత్తాన్ని నేరుగా విడుదల చేయకూడదని మీకు తెలియదా ?
- రూ.55 కోట్లను ఎఫ్‌ఈఓ కంపెనీకి బదిలీ చేయమని మంత్రిగా కేటీఆర్ మీకు ఆదేశాలు ఇచ్చినా .. ప్రభుత్వ రూల్స్ గురించి ఆయనకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ?
- రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూల్స్, ఫెమా నిబంధనలను పాటించకుండా బ్యాంక్ నుంచి ఎఫ్‌ఈఓ కంపెనీకి నిధులను ఎలా బదిలీ చేశారు ?
- హెచ్‌ఎండీఏ అధికార పరిధిని మించిన స్థాయిలో రూ.55 కోట్లను విదేశీ కంపెనీకి బదిలీ చేశారు.. దీనిపై కేటీఆర్‌తో పాటు ఇంకా ఎవరెవరు మీకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు ?
- గ్రీన్ కో కంపెనీ కార్ రేసు స్పాన్సర్ షిప్ నుంచి ఎందుకు తప్పుకుంది ?
- ఇదే విధంగా ఇంకా ఏవైనా అంశాలకు అక్రమంగా నిధులను విడుదల చేశారా ?
Also Read :Woman Body Structure : మహిళల శరీరాకృతిపై కామెంట్ చేయడమూ లైంగిక వేధింపే: హైకోర్టు
బీఎన్‌ఎల్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులోనే ఇవాళ ఈడీ కార్యాలయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎన్‌ఎల్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్పాన్సర్స్ చెల్లించాల్సిన డబ్బును హెచ్‌ఎండీఏ ఎందుకు కట్టింది ? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ? అనే కోణంలో బీఎన్‌ఎల్ రెడ్డిని ఈడీ ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ సిబ్బంది నమోదు చేస్తున్నారు.