Formula E Race Case : ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ విచారణ ఎప్పుడు ? ఆయనను తెలంగాణ ఏసీబీ ఎప్పుడు ప్రశ్నించనుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో ఏసీబీ తన దర్యాప్తును శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో తెలంగాణ మున్సిపల్ శాఖ, లండన్‌లోని ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్(ఎఫ్‌ఈవో) మధ్య జరిగిన అగ్రిమెంటు, దానిలో జరిగిన ఉల్లంఘనలపై ప్రస్తుతం ఏసీబీ సమగ్రంగా స్టడీ చేస్తోంది. ఈ అధ్యయనంలో గుర్తించే కీలకమైన ఉల్లంఘనల ప్రాతిపదికన దర్యాప్తును ముందుకు తీసకెళ్లాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు. తదుపరిగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి వాంగ్మూలాలను సేకరించిన అనంతరం కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు ఏసీబీ ఉపక్రమిస్తుందని అంటున్నారు.
Also Read :Eating With Our Hands: చేతులతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
లండన్‌లోని ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్(ఎఫ్‌ఈవో) కంపెనీ బ్యాంకు అకౌంటుకు రూ.46 కోట్లు విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐవోబీ) శాఖ నుంచి పంపారు. ఈ డబ్బును బదిలీ చేసేందుకు.. బ్యాంకు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి పత్రాలను సమర్పించారు అనేది కీలకంగా మారనుంది. ఫార్ములా ఈ-రేస్(Formula E Race Case) ఒప్పందంతో సంబంధం లేని జీవోను ఒప్పందపత్రంగా చూపించి, నగదును బదిలీ చేసి ఉండొచ్చని ఏసీబీ అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఏసీబీ సేకరించనుంది. బీఎల్‌ఎన్‌రెడ్డి, అర్వింద్‌కుమార్‌తో పాటు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలలోని అంశాల ఆధారంగా కేటీఆర్‌ను అడిగే ప్రశ్నలను ఏసీబీ ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read :Flashback Sports 2024: ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఎవరంటే?
‘రేస్’ ఒప్పందంలో కీలక ఉల్లంఘనలు ఇవీ..
- తొలిసారి కుదిరిన ఒప్పందం ప్రకారం.. సీజన్-10 ఫార్ములా ఈ- రేస్ కోసం ఏస్ నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈవో)కు రుసుం చెల్లించాలి. 2023 మే నాటికి మొదటి వాయిదాగా 50 శాతం సొమ్మును చెల్లించాలి. కానీ, ఏస్ నెక్ట్స్‌జెన్ రుసుంను చెల్లించలేదు.
- దీంతో 2023 సెప్టెంబరులో ఎఫ్‌ఈవో ప్రతినిధులు, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రుసుం చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టే అంశంపై చర్చించారు. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అనధికారికంగా అంగీకరించినట్లు గుర్తించారు.
- రేస్‌ల నిర్వహణ నిమిత్తం రూ.160 కోట్లకు పరిపాలన అనుమతి కోసం అర్వింద్‌కుమార్ 2023 సెప్టెంబరు 27న నోట్ ఫైల్ సిద్ధం చేశారు. మొదటి వాయిదా చెల్లింపు అభ్యర్థనతో హెచ్‌ఎండీఏ రూపొందించిన నోట్ ఫైల్‌ను అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారు. మంత్రి కేటీఆర్ అప్పట్లో హెచ్‌ఎండీఏకు వైస్‌ఛైర్మన్ మాత్రమే. దానికి ఛైర్మన్‌గా ఉన్న సీఎం నుంచి అనుమతి తీసుకోలేదని సమాచారం.
- రూ.10 కోట్ల వరకే హెచ్‌ఎండీఏ మంజూరు చేయగలదు. అంతకు మించితే ఆర్థికశాఖ క్లియరెన్స్ కావాలి. కానీ ఆర్థికశాఖ అనుమతులేవీ లేకుండానే గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలో 2023 అక్టోబరు 3న రూ.23 కోట్లు, అదేనెల 11న రూ.23 కోట్లు చెల్లించేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రెండూ కలిపి మొత్తం రూ. 46 కోట్లను అక్టోబరు 11వ తేదీనే ఎఫ్‌ఈవో ఖాతాకు బదిలీ చేశారు.
- ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపు(టీడీఎస్) చేయకుండా మొత్తం సొమ్మును చెల్లించారని ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది.