Site icon HashtagU Telugu

Formula E Car Race Case : జనవరి 16న విచారణకు రండి.. కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు

Ktr Ed Acb Formula E Race Case

Formula E Car Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. వాస్తవానికి ఇవాళే (జనవరి 7) ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గైర్హాజరు అయ్యారు. తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును ఇవ్వనున్న నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు తనకు టైం ఇవ్వాలని ఈడీ అధికారులను కేటీఆర్ కోరారు. అందుకు ఈడీ అంగీకరించింది. తదుపరిగా జనవరి 16న విచారణకు రావాలని సూచించింది.  హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తదుపరిగా కేటీఆర్‌ను ఈడీ విచారించే క్రమంలో ఏం జరగబోతోంది ? ఆయనను అరెస్టు చేస్తారా ? అనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు ఈనెల 9న విచారణకు రావాలని తెలంగాణ ఏసీబీ కూడా ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.

Also Read :Fact Check : రూ.5000 నోటును ఆర్‌బీఐ విడుదల చేసిందా ? నిజం ఏమిటి ?

కేటీఆర్ ట్వీట్ వైరల్

ఓ వైపు ఏసీబీ, మరోవైపు ఈడీ వరుస నోటీసులను కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ చేసి ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి. మాకు తగిలిన ఎదురుదెబ్బ కంటే మేం తిరిగి పుంజుకోవడం మరింత బలంగా ఉంటుంది’’ అని ఆ ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. ‘‘మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. మీ మాటలు నన్ను తగ్గించవు’’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. మొత్తం మీద ఈ కేసులు తనను ఏమీ చేయలేవనే సంపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. తద్వారా బీఆర్ఎస్ క్యాడర్‌లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. త్వరలోనే తన పోరాటానికి ప్రపంచం కూడా సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.