Pocharam Srinivas Reddy: బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ కీలక పదవి అప్పగించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి హోదాలో సలహాదారుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని ప్రభుత్వం రెండేళ్లపాటు నియమించింది. శ్రీనివాస్ రెడ్డి జూన్ 21న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్ నుండి వైదొలిగారు. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమయ్యారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రిగా పదవి కేటాయించారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగా అప్పుడు కూడా ఆయనకు కీలక పదవి ఇచ్చారు. 2018లో కేసీఆర్ పోచారంకు శాసనసభాపతిగా అవకాశం కల్పించారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరారు.
Also Read: Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం