Ramreddy Damodar Reddy: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దామోదర్ రెడ్డి మృతితో సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరణం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రజాజీవితంలో ‘దామన్న’ ప్రస్థానం
రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. సూర్యాపేట రాజకీయాల్లో ‘దామన్న’గా ఆయన సుపరిచితులు. సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో ఉన్న ఆయన మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. తదనంతరం సూర్యాపేట నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Also Read: Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దామోదర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ (సమాచార సాంకేతిక శాఖ) శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తెలంగాణ వాణిని బలంగా వినిపించిన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
అంత్యక్రియలు ఎల్లుండి తుంగతుర్తిలో
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శనివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. దామన్న మరణవార్త విని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తుంగతుర్తిలో పెద్ద ఎత్తున ఆయన అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ఆకస్మిక మృతితో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
