Site icon HashtagU Telugu

Rega Kantarao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్‌.. ఎందుకంటే ?

Rega Kantarao Kothagudem

Rega Kantarao : ఇవాళ ఖమ్మంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అశ్వాపురంలోని బీజీ కొత్తూరులో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో 14 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఇంతకీ రేగా కాంతారావు‌ను(Rega Kantarao) పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు అంటే..ఆయన ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.  ‘‘మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఇస్తానని సీఎం ప్రకటించకపోతే ఆయన కార్యక్రమాన్ని అడ్డుకుంటాం’’ అని రేగా కాంతారావు వార్నింగ్ ఇచ్చారు. పినపాక నియోజకవర్గానికి సాగునీటిని అందించే మారెల్లిపాడు ట్యాంక్ పనులను ఎందుకు ఆపారని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాకు సాగునీటిని అందించకుండా పక్క జిల్లాకు ఎందుకు తీసుకుపోతున్నారని రేగా కాంతారావు అడిగారు. ఈ చర్యలకుగానూ తమ జిల్లా రైతాంగానికి సీఎం  రేవంత్ సారీ చెప్పాలని ఆయన కోరారు. అందుకే సీఎం రేవంత్‌ పర్యటన నేపథ్యంలో రేగా కాంతారావును అరెస్టు చేశారు.

  • ఇవాళ ఉదయం 11:45 గంటలకు సీఎం రేవంత్ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం గ్రామానికి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. ఈరోజు మధ్యాహ్నం 12.50  గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పంప్ హౌస్-2ను సీఎం ప్రారంభిస్తారు. దీంతో దాని నుంచి గోదావరి జలాల విడుదల ప్రక్రియ మొదలవుతుంది.
  • ఇవాళ మధ్యాహ్నం 2.45 గంటలకు సీఎం రేవంత్ వైరా‌కు బయలుదేరుతారు.
  • వైరాలో నిర్వహించే బహిరంగసభలో చివరి విడత రూ.2 లక్షల రైతు రుణమాఫీ నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ పేర్లతో రెండు ఎత్తిపోతల పథకాలను దివంగత సీఎం వైఎస్సార్ గతంలో ప్రారంభించారు. తాజాగా ఈ రెండు ప్రాజెక్టులను కలిపేస్తూ ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలకు గోదావరి నీరు ఇచ్చేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు.
  • 2016 ఫిబ్రవరి 16న  సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు నాటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు రూ.8 వేల కోట్లకు పైగా దీనిపై ఖర్చు చేశారు.
  • తాజాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రధాన కాల్వ 102 కి.మీ. వద్ద 9.8 కి.మీ. నిడివితో రాజీవ్‌ కెనాల్‌ను నిర్మించి గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ కాల్వ ద్వారా వైరా రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్‌ చేశారు. తద్వారా 1.20 లక్షల ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టుకు గోదావరి నీరు అందించే అవకాశముంది.