Fish Prasadam: ఆస్తమా, ఉబ్బసం రోగులకు గొప్ప వరం.. చేపమందు ప్రసాదం!

బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. 

  • Written By:
  • Updated On - June 8, 2023 / 12:21 PM IST

శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నా.. చేపమందు ప్రసాదానికి ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వందలు.. వేలు కాదు.. లక్షలాది మంది ఈ ప్రసాదం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే.. చేపమందు శక్తి ఏమిటో ఇట్టే అర్ధమవుతోంది. మృగశిర కారైలో అయితే రైతులు ఎలాగో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తారో, లక్షలాది ఆస్తమా రోగులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర కారై వస్తే వస్తుందంటే చాలు దేశ నలుములాల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది.

నిజాం కాలం నుంచే..

ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.

మూడు రకాలుగా పంపిణీ

అపట్లో ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలిలో కొద్దిమంది ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కొరమీను చేపపిల్ల నోటిలో ఆ ప్రసాదాన్ని ఉంచి రోగి చేత ఆ చేప పిల్లను మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో ప్రసాదాన్ని అందిస్తారు. చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి… ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.

మృగశిర కార్తెలోనే ఎందుకంటే

ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం… మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.

మూడేళ్ల తర్వాత చేపమందు ప్రసాదం

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి చేప మందును పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా మూడేళ్ల తర్వాత బత్తిని కుటుంబం ఈ సంవత్సరం చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ల పర్యవేక్షణలో బత్తిన హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రెండు రోజులపాటు 5లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప ప్రసాదం తయారు చేస్తున్నారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి.

Also Read: Siddharth: డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ: బొమ్మరిల్లు సిద్దార్థ్