Hyderabad Fire: హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో ఉన్న గుల్జార్‌హౌస్ చాలాఫేమస్. ఈరోజు (ఆదివారం) ఉదయం గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనం మొదటి అంతస్తులో అకస్మాత్తుగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భీకర మంటల్లో పదుల సంఖ్యలో జనం చిక్కుకున్నారు. అరుపులు కేకలు పెట్టారు. ఎవరైనా వచ్చి తమను కాపాడాలంటూ అరిచారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమైన చనిపోయినట్లు గుర్తించారు. మరో 14 మంది శరీరం దారుణంగా కాలిపోయింది. వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ చనిపోయారు. అంటే ఇప్పటివరకు గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 17కు చేరింది.
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 19 నుంచి మే 25 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి మొత్తం 20 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు(Hyderabad Fire) కలిసి రక్షించారు. వారిలో కొందరిని ఉస్మానియా ఆస్పత్రికి, మరికొందరిని మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి, డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. అయితే వీరిలో 14 మంది చికిత్సపొందుతూ చనిపోవడం విషాదకరం. షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్‌హౌస్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే అధికారుల సమగ్ర దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. చనిపోయిన వారిలో.. అభిషేక్ మోదీ (30), అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్, రజని అగర్వాల్, ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), రాజేంద్రకుమార్ (67), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రిషభ్ ఉన్నారు.
Also Read :Yuvagalam : ‘యువగళం కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరించిన ప్రధాని.. సంతకం చేసి లోకేశ్‌కు బహూకరణ
17 మంది మృతి చెందడం బాధాకరం : సీఎం రేవంత్
ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గుల్జార్‌హౌస్ వద్ద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని ఆయన చెప్పారు. చిన్న ప్రమాదమే అయినా, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాలని కోరారు.
స్పందించిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనలో 17 మంది చనిపోవడం కలచివేసిందని ప్రధాని మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.