Falcon Scam: ఓ మోసపూరిత స్కాంలో భాగంగా తక్కువ కాలంలో అధిక లాభాలు అందిస్తామంటూ మోసగాళ్లు వేలాదిమందిని ఆకర్షించారు. ఫాల్కన్ స్కామ్ (Falcon Scam) పేరుతో 6979 మందిని మోసగించి రూ.1700 కోట్లు వసూలు చేసిన ఘటనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన ఈ స్కాంలో దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్‌లకు ఈ అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది.
సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం జరిపిన విచారణలో, హైదరాబాద్‌లోనే రూ.850 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. నిందితుల్లో పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరి, అనంతను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితులు ఫాల్క్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమర్‌దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ దుబాయ్‌కి పారిపోయారు. వారి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ స్కామ్ వెనుక అమర్‌దీప్ కుమార్ 2021లో ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించడం కీలకంగా మారింది. ప్రజలను మోసగించేందుకు ఒక ముఠాను ఏర్పరచి, వారికి ఆకర్షణీయమైన ప్రణాళికలు చూపించారు. స్పెషల్ మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రూపొందించి, తాము అమెజాన్, బ్రిటానియా, గోద్రేజ్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని నమ్మబలికారు. డిపాజిటర్లకు రూ.25,000 నుంచి రూ.9 లక్షల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించి, వార్షికంగా 11 నుంచి 22 శాతం లాభం అందిస్తామని ప్రచారం చేశారు.
ఇలా 6979 మంది నుండి రూ.1700 కోట్లు సేకరించిన నిందితులు, ఆ మొత్తాన్ని 14 సంస్థల్లో పెట్టుబడిగా చూపించారని వెల్లడైంది. అయితే, వీటిలో కొన్ని ఒప్పందాలు నకిలీగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కంపెనీ యజమానులు కొంతమందికి రూ.850 కోట్లు తిరిగి చెల్లించినప్పటికీ, ఇంకా రూ.850 కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.
అంతేకాక, ఈ మోసంలో భాగంగా నిందితులపై గతంలోనూ మల్టీ లెవల్ మార్కెటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్‌గా పనిచేసిన నెల్లూరి కావ్యను అరెస్టు చేశారు. ఈ స్కామ్‌పై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితులు ముందుకు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
Read Also : Fibernet : ఫైబర్‌నెట్‌లో పెరుగుతున్న వివాదం.. చైర్మన్ జీవీ రెడ్డి vs ఎండీ దినేశ్‌కుమార్