Fake Interviews: రైల్వే, విమానాశ్రయం, సైబర్‌క్రైమ్ విభాగాల్లో జాబ్స్ ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు గుంజారు. మేమే హెచ్‌ఆర్ మేనేజర్లం అంటూ ఇంటర్వ్యూలు చేశారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసి, వాటి నుంచి కాల్ లెటర్లు పంపారు. మన దేశంలో, విదేశాల్లోనూ జాబ్స్ ఇప్పిస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని ఒక ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ ఈవిధంగా మోసపూరిత దందా నడిపింది. ఇది దాదాపు రూ.3.5 కోట్లు సేకరించి బిచాణా ఎత్తేసింది. బాధితుల నుంచి పోలీసులకు కంప్లయింట్ రావడంతో బండారం వెలుగుచూసింది.
Also Read :Satellite Telecom: మనకూ శాటిలైట్ టెలికాం.. ఛార్జీ ఎంత ? ఏ కంపెనీలు కనెక్షన్ ఇస్తాయి ?
హెచ్‌ఆర్ విభాగాల షాక్
సదరు ఫేక్ జాబ్(Fake Interviews) కన్సల్టెన్సీ.. పలు నకిలీ మెయిల్ ఐడీల నుంచి దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను పంపింది. వాటిని తీసుకొని అభ్యర్థులంతా, అందులో ఉన్న అడ్రస్ ప్రకారం ఆయా కంపెనీలకు వెళ్లారు. తాము ఉద్యోగంలో చేరడానికి వచ్చామని చెప్పారు. ఆ అపాయింట్‌మెంట్ లెటర్లను పరిశీలించిన సదరు కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలు షాకింగ్ విషయాన్ని వినిపించాయి. అవన్నీ ఫేక్ నియామక ఉత్తర్వులను తేల్చి చెప్పాయి. ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటారని తెలిపాయి. దీంతో తాము మోసపోయామని బాధిత నిరుద్యోగ యువత గుర్తించారు. ఆ ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలన్నీ ఫేక్ అని తేలింది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు అసలైన కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు కాదని, వాళ్లంతా బ్రోకర్లే అని వెల్లడైంది. లక్షల శాలరీ ప్యాకేజీ వస్తుందంటే ఆశపడి యువత.. సదరు ఫేక్ జాబ్ కన్సల్టెన్సీకి లక్షలు ఇచ్చుకున్నారు.
Also Read :Indsol Company : కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖ
980 మందికి కుచ్చుటోపీ
2024 సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉద్యోగాల పేరిట 980 మంది యువత మోసపోయారు. వాళ్లు ఫేక్ జాబ్ కన్సల్టెన్సీలకు ఇచ్చుకున్న డబ్బు మొత్తం విలువ దాదాపు రూ.10 కోట్ల దాకా ఉంటుంది. ఈ సంవత్సరం (2025) తొలి 50 రోజుల్లో ఈవిధంగా 60 మందికి పైగా యువత మోసపోయారు. ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయలు ఇచ్చుకొని దగాపడ్డారు. వారి నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి మోసాల బారినపడిన వారు తప్పకుండా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సైబర్‌క్రైమ్ డీసీపీ కవిత దార సూచించారు.