వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆమె గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. ఇదే అదనుగా భావించిన ఓ మహిళ, డాక్టర్ వేషధారణలో వైట్ కోట్ వేసుకుని సుధారాణి గదిలోకి ప్రవేశించింది. చికిత్స చేయాలనే నెపంతో గదిలో ఉన్న రోగి బంధువులను బయటకు పంపింది. అనంతరం సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి పరారైంది.
కాసేపటి తర్వాత గదిలోకి వెళ్లిన బంధువులు, సుధారాణి మత్తులో ఉండటాన్ని, ఆమె ఒంటిపై ఆభరణాలు లేకపోవడాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా, ఆ మహిళ తమ సిబ్బంది కాదని, ఆమె ఎవరో తమకు తెలియదని వారు తెలిపారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలోని నర్సింగ్ స్టాఫ్ రూమ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో నకిలీ డాక్టర్ కదలికలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఆసుపత్రిలో పనిచేసే తెలిసిన వ్యక్తా? లేక బయటి వ్యక్తా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
