Site icon HashtagU Telugu

Cabinet Social Balance : క్యాబినెట్ లో అనుభవజ్ఞులు.. సామాజిక సమతుల్యత..

Experienced In The Cabinet.. Social Balance..

Experienced In The Cabinet.. Social Balance..

By: డా. ప్రసాదమూర్తి

Cabinet Social Balance : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గం ఎంతో అనుభవజ్ఞులైన నాయకులతో సామాజిక సమతుల్యతతో ఆశావహంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో నేర్పుగా సామాజిక న్యాయాన్ని, నాయకుల అనుభవాన్ని ఒకచోట చేర్చి ఈ క్యాబినెట్ (cabinet)ను కూర్చినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కాదు. అయితే భట్టి విక్రమార్క వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చీఫ్ విప్ గా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డికి మంచి అనుభవమే ఉంది. వీరిద్దరి నేతృత్వంలో అధిష్టానం ఆలోచించి మంత్రివర్గంలో ఎలాంటి సమతుల్యత దెబ్బతినకుండా నాయకులను ఏర్చి కూర్చిన విధానం రాజకీయ వర్గాల్లో మంచి స్పందన పొందింది.

We’re Now on WhatsApp. Click to Join.

దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసిన అనుభవజ్ఞులు. తుమ్మల నాగేశ్వరరావు గతంలో చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న పొంగులేటి, తుమ్మల, జూపల్లి, బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించిన వారు. ఈ ముగ్గురు ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించినట్టు ఈ ఫలితాలు చెబుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చి విజయానికి తోడ్పడిన వారికి సముచిత స్థానాన్ని ఇవ్వడంతో పాటు, పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్లను కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకొని భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు లాంటి వారికి క్యాబినెట్లో (cabinet) కీలక పదవులను కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టి విజ్ఞత ప్రదర్శించింది.

అనుభవజ్ఞుల విషయం అలా ఉంటే, క్యాబినెట్లో (cabinet) సామాజిక సమతుల్యతకు కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు పెద్దపీట వేశారు. గౌడ కులానికి చెందిన పొన్నం ప్రభాకర్, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ, ఎస్సీ లో మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క, మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజనర్సింహ, ఎస్టీ కోయ ఆదివాసి సభ్యురాలు శ్రీమతి అనసూయ ఈ కొత్త కాంగ్రెస్ క్యాబినెట్లో స్థానాన్ని పొందారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో సామాజిక న్యాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తమ ప్రభుత్వాల్లో సామాజిక న్యాయానికి సముచిత స్థానం ఉంటుందని వాగ్దానం చేసిన నేపథ్యంలో, తెలంగాణలో ఏర్పడిన ఈ క్యాబినెట్ దానికి అద్దం పడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read:  3 New CMs : మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికకు పరిశీలకుల టీమ్స్

అలాగే అగ్రవర్ణాలలో ముగ్గురు రెడ్డి కులస్తులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కాగా, ఒక బ్రాహ్మిన్, ఒక వెలమ, ఒక కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ క్యాబినెట్లో చోటు సంపాదించుకున్నారు. అటు అనుభవంలోనూ ఇటు సామాజిక సమతుల్యతలోనూ ఒక స్పష్టమైన అవగాహనతో ఈ క్యాబినెట్ ను సమకూర్చి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి విమర్శలకు దారి తీయని సంకేతాలను ఇచ్చినట్టుగా అర్థమవుతుంది.

ఇంకా మరి కొందరు క్యాబినెట్లో చేరాల్సి ఉంది. ఆరుగురు కేంద్ర మంత్రులను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. వారిలో ఒకరు మైనారిటీ వర్గానికి చెందిన వారు ఉండొచ్చు. ఇంకా గుర్తింపు ఉన్న కొన్ని సామాజిక వర్గాల నుంచి మంత్రివర్గంలోకి సభ్యులను తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇదంతా ఎలా ఉన్నా, అనుభవిజ్ఞులు, సామాజిక సమతుల్యత పాటించినా, ప్రభుత్వాన్ని నడిపే తీరు.. చేసిన వాగ్దానాలు నెరవేర్చే తీరు.. ప్రజలను సంతృప్తి పరిచే తీరుతెన్నుల మీదే ప్రభుత్వ విజయం ఆధారపడి ఉంటుంది. చేసిన వాగ్దానాలను అమలు చేసే దిశగా తొలి అడుగులు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వేచి చూడాలి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎంత చిత్తశుద్ధిగా ఉంటుందో.

Also Read:  CM Revanth Reddy : ముగిసిన విద్యుత్, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష