Site icon HashtagU Telugu

Telangana: మునుగోడు ఎన్నికల ముందు బీజేపీకి మరో షాక్..!

Cropped (1)

Cropped (1)

రానున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సోమవారం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరనున్నారు. ఈ విషయమై భాస్కర్ ఆదివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)తో మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో చేనేతలపై జిఎస్‌టి విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ నిరాశను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి కెసిఆర్ తీసుకుంటున్న చర్యలను తాను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు.

భాస్కర్ చేనేత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తెలంగాణలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు జిల్లాలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు ముందు కొంత మంది బిజెపి నాయకులు టిఆర్‌ఎస్ వైపు మారడం గమనించాల్సిన విషయం. ఈ నెల ప్రారంభంలో బూడిద బిక్షమయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీనికి ముందు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన శ్రవణ్ దాసోజు తిరిగి టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

2012-18 మధ్య రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభకు ఎన్నిక కాక ముందు ఆనంద భాస్కర్ జర్నలిస్టుగా పని చేశారు. చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాపోలు ఆనంద భాస్కర్‌ బీజేపీలో చేరారు. మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాపోలు ఆనంద్‌ భాస్కర్‌.. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడం ఆసక్తికర పరిణామం.