Etela Rajendar: కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ (Etela Rajendar) 113వ సాక్షిగా కమిషన్ ముందు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో జరిగిన విచారణలో ఈటెలతో “అంతా నిజమే చెప్తాను” అని ప్రమాణం చేయించిన కమిషన్.. 40 నిమిషాల పాటు 19 ప్రశ్నలు ఆయనకు సంధించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) వంటి అంశాలపై కమిషన్ ప్రశ్నలు కేంద్రీకృతమయ్యాయి. ఆర్థిక మంత్రిగా తన పదవీ కాలం గురించి, బ్యారేజీల నిర్మాణ నిర్ణయం ఎవరు తీసుకున్నారని కమిషన్ అడిగింది. ఈటెల స్పందిస్తూ, టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ సిఫారసుల మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాతే నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని 150 టీఎంసీ నుంచి 148 టీఎంసీకి తగ్గించామన్నారు.
Also Read: Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు
మూడు బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేబినెట్‌దేనని, రీ-డిజైన్‌కు మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చోటు చేసిన సబ్ కమిటీ నిర్ణయం ఆధారంగా జరిగిందని ఈటెల వివరించారు. ఈ కమిటీలో హరీష్ రావు చైర్మన్‌గా, తాను, తుమ్మల నాగేశ్వర రావు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. డీపీఆర్ కోసం వ్యాప్కోన్ సంస్థకు 597.45 లక్షలు చెల్లించారా అన్న ప్రశ్నకు ఈటెలకు తెలియదని సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ నిధుల సమీకరణ, రుణాల కోసం ఏర్పాటైందని, ఆర్థిక శాఖ పరిధిలోకి రాదని వెల్లడించారు.
లోన్స్ రీ-పేమెంట్ కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదని ఈటెల తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్న ప్రశ్నకు.. అది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణ స్థానాలపై టెక్నికల్ టీం నిర్ణయాలే కీలకమని ఈటెల పేర్కొన్నారు.