వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacherla) ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela) స్పందించారు. లగచర్లలో ఫార్మా ప్రాజెక్ట్ కోసం భూములను బలవంతంగా తీసుకోవడం అన్యాయం అని, దీనికి ప్రభుత్వానికి హక్కు లేదని అన్నారు. ఈ ఘటనపై ఢిల్లీలోని మీడియా ద్వారా ఈటెల స్పందించారు. రైతుల ఆందోళనల మధ్య పోలీసులు భూసేకరణ జరిపేందుకు సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం రైతుల ఉపాధి మీద దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మా భూములు లాక్కుని తమ ఉపాధి మీద దెబ్బకొట్టవద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనలను అర్థం చేసుకోకుండా వారి మాటలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసిందని దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.
అక్రమ కేసులు పెడితే మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో ముచ్చర్లలో సేకరించిన భూమిని ఫార్మా కంపెనీలకు (Pharma Company) అప్పజెప్పాలని చూస్తే బీజేపీ సహా కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు. కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజలు ఓట్లేసింది బ్రోకర్ గిరి చేయడానికో, మధ్యవర్తిత్వం చేయడానికో కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికంపై ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులు భూమి సర్వే కోసం వెళ్లగా..గ్రామస్థులు అడ్డుకున్నారు. కలెక్టర్‌తోపాటు అధికారులఫై దాడి చేశారు. ఈ దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేల లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. కరెంటు తీసేసి ప్రతి ఇంటిని జల్లడపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను అడ్డుకున్నారు. ఫొటోలను డిలీట్ చేయించి.. అక్కడిని పంపించారు. దుద్యాల, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పోలీసుల జులుంపై తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Kishan Reddy : ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు: కిషన్ రెడ్డి