KCR On Modi: గొప్పల డప్పు కొట్టుకోవడం ఆపండి.. అభివృద్ధి సంగతేందో చెప్పండి: మోడీపై కేసీఆర్ మాటల వార్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.

  • Written By:
  • Publish Date - May 26, 2022 / 10:43 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. ” మాటకారి తనంతో గొప్పల డప్పులు కొట్టుకోవడం ఆపి.. దేశంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మోదీ చెప్పాలి” అని కేసీఆర్ ప్రశ్నించారు. 2014లో కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం వల్ల జనం బతుకులు భారంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని స్థాయిలో రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయిందని కేసీఆర్ చెప్పారు. గురువారం ఉదయమే కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్, మాజీ ప్రధానమంత్రి దేవె గౌడ , దేవె గౌడ కుమారుడు కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికల సమీకరణాలపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా..

భారత్ తో పాటే స్వాతంత్ర్యం సాధించిన ఎన్నో దేశాలు అభివృద్ధి పథంలో చాలా ముందుకు దూసుకుపోయాయని కేసీఆర్ చెప్పారు. స్వాతంత్ర్య భారతదేశాన్ని సాధించుకొని 75 ఏళ్ళు గడిచినా.. ఇప్పటికీ పేదలు, దళితులు, రైతులు, ఆదివాసీల ముఖాల్లో చిరునవ్వులు చిందే పరిస్థితులు లేవని తెలిపారు. ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు చెప్పండి ? అని కేసీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటన కు వచ్చారు. ఈ సమయానికి కొన్ని గంటల ముందే కేసీఆర్.. దేవెగౌడ ను కలిసేందుకు బెంగళూరుకు వెళ్లారు. గత 4 నెలల్లో మోడీ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చారు. ఈ రెండుసార్లు కూడా మోడీ హైదరాబాద్ కు రాగా, కేసీఆర్ ఇతర రాష్ట్రాల కు వెళ్లారు. తెలంగాణ లో టీఆర్ఎస్ కు సవాల్ విసిరేందుకు సిద్ధం అవుతున్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు లక్ష్యంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.