Private Colleges: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలకు (Private Colleges) సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య చివరకు కొలిక్కి వచ్చింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రజాభవన్‌లో యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్ (సమ్మె)ను తక్షణమే విరమించుకుంటున్నట్టు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రకటించింది.
బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ
ప్రైవేట్ యాజమాన్యాలు కోరిన బకాయిల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. గతంలో హామీ ఇచ్చిన రూ. 1,200 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. మిగిలిన రూ. 600 కోట్లు ఈ నెలలో అంటే మూడు నుంచి నాలుగు రోజుల్లోపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యాలు అదనంగా కోరిన రూ. 300 కోట్లకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చూపే దిశలో యాక్షన్ ప్లాన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించిన పాతి సంఘం సభ్యులు.. నవంబర్ 3వ తేదీ నుంచి కొనసాగుతున్న కళాశాలల బంద్‌ను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ఆలోచించి ఈ చర్చల్లో పాల్గొనడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్రంలో కళాశాలల బంద్ అనేది ఉండదు. కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి ప్రతి నెలా ఎంతో కొంత తప్పనిసరిగా విడుదల చేస్తామని వివరించారు.
Also Read: Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వద్ద అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!
కమిటీ ఏర్పాటు, సంస్కరణలకు అవకాశం
ఫీజు రియంబర్స్మెంట్‌తో పాటు కళాశాలల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని యాజమాన్యాలు గతంలో కోరాయి. వారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫీజు బకాయిలు, ఇతర సమస్యలకు సంబంధించి ఎలాంటి సంస్కరణలు అవసరమో అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కమిటీని కోరతామని ఆయన పేర్కొన్నారు.
నిరసన కార్యక్రమాలు రద్దు
చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు. రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటాం. పిల్లలను రోడ్లపైకి తెచ్చే ఆలోచన చేయం. ఎన్నికల కోడ్ సమయంలో నిరసన కార్యక్రమాలు తప్పు అని కోర్టు చెప్పింది. మాలో పొరపాటు వల్లే ఇది జరిగిందని తెలిపారు.
