Site icon HashtagU Telugu

BC Reservation : రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు – హైకోర్టు

Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను 42% వరకు పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. గురువారం నాడు ఇచ్చిన ఆ ఆదేశాల పూర్తి వివరాలు అర్ధరాత్రి అధికారికంగా విడుదలయ్యాయి. వాటి ప్రకారం గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు పాత విధానానుసారం అంటే రిజర్వేషన్లు మొత్తం 50% దాటకుండా – నిర్వహించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో 17% పెంపు నిర్ణయం తాత్కాలికంగా నిలిపివేయబడింది.

‎Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

హైకోర్టు తన తీర్పులో ముఖ్యమైన సూచనలు చేసింది. పెరిగిన 17% సీట్లను తాత్కాలికంగా “ఓపెన్ కేటగిరీ”గా ప్రకటించి, ఎన్నికలను జరపాలని పేర్కొంది. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శకంగా ఉండనుంది. కోర్టు అభిప్రాయపడినదేమిటంటే, ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపును అమలు చేసే ముందు తగిన శాస్త్రీయ అధ్యయనం, డేటా విశ్లేషణ, ప్రజా ప్రతినిధుల కేటగిరీల వారీగా సమతుల్య పంపిణీ వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందని. సమగ్ర సర్వే లేకుండా, శాతం పెంపు నిర్ణయం రాజ్యాంగ ప్రమాణాలను ఉల్లంఘిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి సవాల్ ఎదురైంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియలో ఉన్నందున, ఇప్పుడు ప్రభుత్వం తదుపరి చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశమూ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు బీసీ సంఘాలు కోర్టు నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయమైన ప్రతినిధిత్వం దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ పరిణామాలతో తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ మళ్లీ అనిశ్చితిలోకి నెట్టబడింది.

Exit mobile version