Eetala-CBN : టీడీపీతో పొత్తుకు `ఈటెల‌` సంకేతాలు, బీఆర్ఎస్ కు కౌంట‌ర్

తెలంగాణ‌లో బీజేపీ,టీడీపీ పొత్తు ఖాయ‌మా? అంటే బీజేపీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ లీడ‌ర్

  • Written By:
  • Updated On - December 26, 2022 / 04:54 PM IST

తెలంగాణ‌లో బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయ‌మా? 2014 నాటి కూట‌మిని చూడ‌బోతున్నామా? అంటే బీజేపీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ లీడ‌ర్ ఈటెల రాజేంద్ర(Eetala-CBN)తాజా వ్యాఖ్య‌లు ఔననే అనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది ఉన్నాయ‌ని ఆయ‌న చెప్ప‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అంతేకాదు, సుదీర్ఘ‌కాలం పాటు తెలుగుదేశం సేవ‌లు అందించింద‌ని కితాబు ఇచ్చారు. ఎవ‌రైనా ఎక్క‌డైనా పార్టీ పెట్ట‌కోవ‌చ్చు. తెలంగాణ‌కు ఎవ‌రైనా రావ‌చ్చంటూ బీఆర్ఎస్(BRS) మంత్రులు ఇటీవ‌ల ఖ‌మ్మం చంద్ర‌బాబు స‌భ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రోక్షంగా త‌ప్పుబ‌ట్టారు. తెలుగుదేశం పార్టీని ఎవ‌రూ నిషేధించలేద‌ని ఈటెల(Eetala-CBN) తాజాగా చేసిన కామెంట్స్ పొత్తు దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌న‌డానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

ఎనిమిదేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజ‌కీయ తెర‌పై ఉన్న‌ప్ప‌టికీ లేన‌ట్టే ఉంది. ఖ‌మ్మంలో జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ త‌రువాత దానికున్న పూర్వ వైభ‌వం అంద‌రికీ గుర్తొచ్చింది. అంతేకాదు, ఓట‌ర్లు ఆ పార్టీకి ఉన్నార‌ని ఖ‌మ్మం స‌భ ద్వారా స్పష్టం అయింది. కేంద్ర‌, రాష్ట్ర నిఘా వ‌ర్గాలు ఇచ్చిన నివేదిక‌ల ప్ర‌కారం  బీఆర్ఎస్(BRS), బీజేపీలు చంద్ర‌బాబు స‌భ‌పై ఆచితూచి స్పందిస్తున్నాయి. తెలంగాణ‌లో రాజ‌కీయం చేయ‌డానికి మ‌ళ్లీ చంద్ర‌బాబు వ‌స్తున్నారంటూ బీఆర్ఎస్ మంత్రులు హ‌రీశ్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ త‌దిత‌రులు బూచిగా చూపించారు. గ‌తంలోనూ ఆయ‌న్ను ఒక బూచిగా చూపిస్తూ ఎనిమిదేళ్లుగా రాజ‌కీయాల‌ను న‌డిపారు.

చంద్ర‌బాబును బూచిగా  కేసీఆర్(Eetala-CBN)

ప్ర‌త్యేక వాదాన్ని సెంటిమెంట్ గా చూపుతూ గులాబీ లీడ‌ర్లు ప‌బ్బం గ‌డిపారు. లంక‌లో పుట్టిన వాళ్లంద‌రూ రాక్ష‌సుల‌ మాదిరిగా ఆంధ్రోళ్లంద‌రూ దోపిడీదారులే అంటూ కేసీఆర్ గ‌తంలో ప‌లు వేదిక‌ల‌పై వ్యాఖ్యానించారు. అలాంటి వ్యాఖ్య‌ల‌తో పాటు చంద్ర‌బాబును బూచిగా చూపి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీని సామ‌దాన‌దండోపాయాల‌తో బ‌ల‌హీన‌ప‌రిచారు. కానీ, ఇప్పుడు ఖ‌మ్మం స‌భ త‌రువాత సీన్ మారింద‌ని బీఆర్ ఎస్ లీడ‌ర్లు గ్ర‌హించారు. అందుకే, చంద్ర‌బాబు స‌భ‌ను విమర్శిస్తూ తెలంగాణ‌లోకి ఎలా వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ లీడ‌ర్లు కామెంట్ల‌కు బీజేపీ లీడ‌ర్ ఈటెల రాజేంద్ర కౌంట‌ర్ ఇస్తూ టీడీపీని వెనుకేసుకొచ్చారు. అంటే, పొత్తుకు రంగం సిద్దం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా వెళ్ల‌డానికి బీజేపీ సిద్దంగా ఉన్న‌ప్ప‌టికీ అధికారం అంత ఈజీ కాదు. ఆ విష‌యం మునుగోడు ఉప ఎన్నిక‌ల ద్వారా తెలిసింది. పైగా ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. అక్క‌డ టీడీపీ ఓట‌ర్లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. అంతేకాదు, మునుగోడు ఉప ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్ ఎత్తుగ‌డ దాదాపుగా అర్థం అయింది. రాబోవు ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్ట్ ల‌ను క‌లుపుకుని వెళ్ల‌నున్నారు. చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ పార్టీతోనూ జ‌ట్టుక‌ట్టే అవ‌కాశం ఉంది. ఇలాంటి ఈక్వేష‌న్ల న‌డుమ బీజేపీ ఒంట‌రిగా తెలంగాణ‌లో పోటీ చేసి ల‌క్ష్యాన్ని ముద్దాడ‌లేదు. అందుకే, టీడీపీతో పొత్తుకు పాజిటివ్ గా క‌మ‌ల‌నాథుల నుంచి స్పంద‌న వ‌స్తోంది.

బీజేపీ టీడీపీతో పొత్తుకు సిద్దం

క‌నీసం 30 నుంచి 40 స్థానాల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేసేలా టీడీపీ ఓట‌ర్లు తెలంగాణ‌లో ఉన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ తో పాటు చుట్టు ప‌క్క‌ల జిల్లాల్లో టీడీపీ సానుభూతిప‌రులు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి చంద్ర‌బాబు దిశానిర్దేశం కూడా ఇచ్చిన క్ర‌మంలో బీజేపీ ఆలోచిస్తోంది. రాబోవు రోజుల్లో వ‌రంగ‌ల్, నిజామాబాద్‌, సికింద్రాబాద్ కేంద్రాలుగా స‌భ‌లు పెట్ట‌నున్నారు. ఆ స‌భ‌లు కూడా ఖ‌మ్మంలో మాదిరిగా సూప‌ర్ హిట్ అయితే బీజేపీ అనివార్యంగా టీడీపీతో పొత్తుకు సిద్దం అవుతుంది. అందుకే, ఈటెల ముందు నుంచే సానుకూల వ్యాఖ్య‌లు చేస్తూ టీడీపీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు. ఆయ‌న తాజా వ్యాఖ్య‌ల‌తో బీఆర్ఎస్ లో ఆందోళ‌నకు అవకాశం లేక‌పోలేదు.

Also Read : BJP, TDP Alliance : చంద్ర‌బాబుతో బీజేపీ?టార్గెట్ కేసీఆర్‌! గుజ‌రాత్ ఫ‌లితాల జోష్‌!