Actor Navadeep – ED : టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం పుట్టిస్తోంది. యాక్టర్ నవదీప్ కు ఈడీ వరుసగా మూడోసారి నోటీసులు ఇచ్చింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులో గత నెల 23న గుడిమల్కాపూర్ డ్రగ్స్ వ్యవహారంపై నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. నార్కో టిక్ బ్యూరో విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ నోటీసులను ఈడీ ఇచ్చిందని తెలుస్తోంది. డ్రగ్స్ డీలర్స్, కస్టమర్లతో నవదీప్‌కి డైరెక్ట్ లింక్స్ ఉన్నాయని నార్కోటిక్, ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ దందాతో ముడిపడిన పలు ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. ఈక్రమంలోనే అక్టోబరు 10న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు ఇప్పుడు మూడోసారి కూడా నోటీసులను ఇష్యూ చేశారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
సెప్టెంబరు 14న తెలంగాణకు చెందిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్ల సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొకైన్ తో పాటూ పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలోనే.. డ్రగ్స్ వ్యాపారులతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టుగా తమ విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో అరెస్టయిన నిందితుల్లో ఒకరైన రామచందర్ దగ్గర నవదీప్ డ్రగ్స్ కొన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. నవదీప్ తో పాటూ తెలుగు సినీ నిర్మాతలు, పలువురు ప్రముఖులు ఈ కేసులో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వెంకట్, బాలాజీ తో పాటూ మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నవదీప్ ముందు జాగ్రత్తగా బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేయగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. నవదీప్ కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం (Actor Navadeep – ED) తేల్చి చెప్పింది.