Anti Modi Posters : మోడీ వ్యతిరేక పోస్టర్ల కలకలం.. తెలంగాణ పుట్టుకను అవమానించారంటూ ప్రచారం

Anti Modi Posters :  ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

  • Written By:
  • Updated On - October 1, 2023 / 09:19 AM IST

Anti Modi Posters :  ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.  ఈనేపథ్యంలో ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పుట్టుకను పదేపదే అవమానించిన మోడీకి ఇక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని ఆ పోస్టర్లపై రాశారు. ‘‘తెలంగాణను గడబిడగా తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారు. చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరు’’ అని పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలు చేశారంటూ ఈ పోస్టర్లలో తేదీలతో సహా ప్రస్తావించారు.  తెలంగాణ పుట్టుకను మోడీ అవమానించారంటూ పోస్టర్లకు టైటిల్ పెట్టారు.

జల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడంపై..

హైదరాబాద్ లో మరోచోట ఇంకోవిధమైన పోస్టర్లను అతికించారు. తెలుగు రాష్ట్రాల్లోని జల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో మోడీ అన్యాయం చేశారని వాటిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన ప్రధాని మోడీ.. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వలేదని ఆ పోస్టర్లలో రాశారు. తెలంగాణపై మోడీది సవతితల్లి ప్రేమ అని వాటిలో ఎద్దేవా చేశారు.  మోడీకి మహబూబ్ నగర్ లో పర్యటించే నైతిక హక్కు లేదని పోస్టర్లలో ఉంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లు, ఫ్లెక్సీలు వైరల్ (Anti Modi Posters) అవుతున్నాయి.

Also read : MLA Rajasingh : స్థానికులకే డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి.. ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలోని మహబూబ్​నగర్‌ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబ్ నగర్ కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్ హెలి ప్యాడ్ వద్దకు చేరుకోనున్న మోడీ, మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరి (PM Modi – Mahabubnagar) వెళుతారు.  ప్రధాని మోడీ అక్టోబర్ 3న మళ్లీ  తెలంగాణకు వస్తారు. ఆ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.