మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్..గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ కు తరలించారు. చికిత్స తీసుకుంటూనే రాత్రి కన్నుమూశారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ హుటాహుటిన ఎయిమ్స్ హాస్పటల్ కు చేరుకోవడం , ప్రధాని నరేంద్రమోదీ.. మన్మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ఇక మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు తెలంగాణ ప్రజల (People of Telangana) గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి (Formation of Telangana) ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన విషయంలో సున్నితంగా వ్యవహరించి, తెలంగాణ ప్రజల ఆత్మీయ కోరికను నెరవేర్చడంలో ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల పోరాటం చాలా దశాబ్దాలుగా కొనసాగింది. ఆ పోరాటానికి తుది గమ్యం దిశగా దారి చూపిన నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. ప్రజాస్వామ్య విలువలకు అడ్డంకి రావడం ఇష్టం లేని మన్మోహన్, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించి, వారి కోరిన స్వప్నాన్ని నిజం చేసారు. రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ విషయంలో ఆంధ్రా ప్రజల నష్టపోకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన సమతుల్యంగా వ్యవహరించారు. విభజన అనంతరం కూడా రెండు ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి కల్పించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన మన్మోహన్
తెలంగాణ ప్రజల పోరాటాన్ని అర్థం చేసుకున్న మన్మోహన్, వారి ఆకాంక్షలను నిజం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఒత్తిళ్లను అధిగమించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంలో ఆయన సహకారం అపారమైంది. ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజలు ఆయనకు ప్రత్యేకమైన గౌరవం కల్పించారు. తెలంగాణ ఏర్పాటుతో మన్మోహన్ సింగ్ పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇక మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు.
మిత భాషిగా, అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also : Tripti Dimri : యానిమల్ బ్యూటీతో ప్రేమకథ తీస్తున్నారా..?