Kavitha Food Menu : తీహార్ జైల్లో కవిత.. మొదటి రోజు ఏం తిన్నారో తెలుసా ?

Kavitha Food Menu : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 9 వరకు తీహార్​ జైల్లోనే ఉండనున్నారు.

  • Written By:
  • Updated On - March 28, 2024 / 08:21 AM IST

Kavitha Food Menu : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 9 వరకు తీహార్​ జైల్లోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజులు (ఏప్రిల్ 9 వరకు) జ్యుడీషియల్​ రిమాండ్​ విధించింది. కవిత తీహార్ జైలుకు వెళ్లి ఒకరోజు గడిచిపోయింది. జైలులోని 6వ నంబర్ విభాగంలో కవిత ఉంటున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళా ఖైదీలు కూడా అదే సెల్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం కవిత స్నాక్స్‌ తిని, టీ తాగారు. అంతకుముందు మంగళవారం రాత్రి జైలుకు వచ్చాక అన్నం, పప్పుతో భోజనం చేశారని తెలుస్తోంది. ఈక్రమంలో తనతో పాటు జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా కవిత ఆహారం వడ్డించారట. జైలులో మొదటిరోజు బుక్స్ చదివేందుకు కవిత ప్రయత్నించారట. టీవీని చూస్తూ కూర్చున్నారట. టీ, ఆహారం, టీవీ చూసే టైమింగ్స్‌ను ఇతర ఖైదీల మాదిరిగానే కవితకు కూడా అమలు చేశామని తీహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమకు కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులేవీ డిమాండ్ చేయలేదని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను, సౌకర్యాలను అందజేస్తామని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

తీహార్ జైలులో ఉంటున్న కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. జైలుకు ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు.. మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను సొంతంగా ఏర్పాటు చేయించుకునేందుకు న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. పెన్ను, పేపర్లు, మందులను తనతో పాటు జైలులోకి తీసుకెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉండగా కవితకు చేసిన అన్ని వైద్యపరీక్షల రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఇటీవల ఆదేశించారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటి నాటికి సమాధానం ఇవ్వాలని ఈడీకి న్యాయమూర్తి సూచించారు.

Also Read :Telangana Candidates : కాంగ్రెస్ మరో నలుగురు అభ్యర్థులు వీరే

మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందన

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారం గ్లోబల్‌ టాక్‌లా మారింది. ఈ కేసుపై మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించడం కలకలం రేపుతోంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ భారత్‌ కన్నెర్ర చేసింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత(అరవింద్ కేజ్రీవాల్) అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీనిపై సీరియస్‌ అయిన భారత్‌ ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనా సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. అరగంట పాటు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య సంబంధాల్లో దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భావిస్తున్నామంటూ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని, ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయని తేల్చి చెప్పింది.