Seethakka Husband : సీతక్క (దనసరి అనసూయ) ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సీతక్క, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా మార్చి 27న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి సభను నిర్వహించారు. కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సీడీని ఈసందర్భంగా సీతక్క ఆవిష్కరించారు. విమలక్క ప్రసంగించే క్రమంలో తన భర్త కామ్రేడ్ కుంజ రాముని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో సభ ప్రాంగణంలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. ‘‘నేను ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ నుంచి త్రుటిలో బయటపడ్డాను. ప్రస్తుత జీవితం బోనస్. ఈ పునర్జన్మలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నాను’’ అని ఈసందర్భంగా సీతక్క చెప్పారు. సీతక్క భర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
Also Read :Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. భారతదేశంలో కనిపించనుందా?
ఆదివాసీల కోసం గర్జించిన కుంజ రాము
కుంజ రాము ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జన్మించారు. ఆయన 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టులలో చేరిపోయారు. పలు మావోయిస్టు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. మావోయిస్టుగా సీతక్కతో కలిసి కుంజ రాము పనిచేశారు. ఆ సమయంలోనే 2004 సెప్టెంబర్ 30న ఆదివాసీ లిబరేషన్ టైగర్ (ALT) పేరుతో ఒక ఉద్యమ సంస్థను స్థాపించారని అంటారు. ఈ సంస్థ ఆదివాసీ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేది. ఆదివాసీల భూమి, అటవీ హక్కుల రక్షణ, ఆదివాసీల స్వయంప్రతిపత్తి కోసం పోరాటం, ఆదివాసీ ప్రాంతాలలో దోపిడీని అడ్డుకోవడం లక్ష్యంగా కుంజ రాము ఆదివాసీ లిబరేషన్ టైగర్‌ను స్థాపించారని చెబుతారు. కుంజ రాము మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సమయంలో.. ఆయన నుంచి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. సీతక్క కూడా తన భర్త నుంచే స్పూర్తి పొందారు.
కోవర్టు సాయంతో పోలీసుల ఎన్‌కౌంటర్
కుంజ రాము, సీతక్క ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో, సీతక్క(Seethakka Husband) ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నారు. కానీ ఆమె భర్త కుంజ రాము వీర మరణం పొందారు. 2004లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుంజ రాము ఏర్పాటు చేసిన ఆదివాసీ లిబరేషన్ టైగర్ (ALT)లో పనిచేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు కోవర్టుగా మారాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న బయ్యారం- మహబూబాబాద్ అటవీ ప్రాంతంలో తన టీమ్‌తో సమావేశమైన కుంజ రాముపై పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారు. చేతిలో విల్లులు మాత్రమే ఉండటంతో కుంజ రాము దళం పోలీసుల ఎదుట ఎక్కువ సేపు నిలువలేకపోయింది. దీంతో 2005 మార్చి 27న కుంజ రాము అమరులు అయ్యారు.