VVPat Slip : తెలంగాణ ఓటరు మహాశయులు నవంబరు 30న తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ రోజున పోలింగ్ జరగబోతోంది. ఈనేపథ్యంలో ఓటు వేయడానికి సంబంధించిన ఒక కీలకమైన అంశంపై ఓటర్లు అవగాహన పెంచుకోవాలి. అదే వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్).. దాని నుంచి వచ్చే స్లిప్. వీవీ ప్యాట్ అనేది ఒక యంత్రం. మన ఓటు వేశాక.. అందులో నుంచి ఒక స్లిప్ బయటికి వచ్చి, అక్కడున్నబాక్స్‌లో పడిపోతుంది. ఇంతకీ ఏమిటిది అంటే..
- మనం పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం) ద్వారా ఓటు వేస్తాం.
- ఓటు వెయ్యగానే బీప్ శబ్దం వస్తుంది. అది రాగానే.. పక్కనే ఉన్న వీవీ ప్యాట్ వైపు మనం చూడాలి.
- మనం ఏ గుర్తుకు ఓటు వేశామనే వివరాలు వీవీప్యాట్ యంత్రంలోని చిన్నపాటి స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ సమాచారం ఏడు సెకన్ల పాటు నిలిచి ఆ తర్వాత అదృశ్యమవుతుంది.
- వీవీ ప్యాట్ స్క్రీన్‌పై కనిపించిన వివరాలే.. ఆ వెంటనే వీవీ ప్యాట్ నుంచి చిన్నకాగితంపై ప్రింట్ అయి, అదే యంత్రంలో అడుగుభాగాన ఉన్న ఖాళీ బాక్సులో పడిపోతుంది.
- ఆ స్లిప్ ని మనం తీసుకోకూడదు..
- వీవీ ప్యాట్ స్లిప్‌లో అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తు ఉంటాయి.
- దీంతో మనం వేసిన ఓటు పడిందా ? లేదా ? అనే డౌట్ క్లియర్ అవుతుంది.
- లైటింగ్ బాగా ఉంటేనే ఈ స్లిప్ కనిపిస్తుంది. మీరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు పోలింగ్ బూత్‌లో చీకటిగా ఉంటే.. లైట్ వెయ్యమని చెప్పండి.
- ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ ఓటు సమాచారం పోలింగ్ అధికారి వద్ద ఉండే కంట్రోల్ యూనిట్‌కు చేరుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
2018 ఎన్నికలకు ముందు ఈవీఎంలో మనం ఓటు వేయగానే ఆ సమాచారం నేరుగా పోలింగ్ అధికారి వద్ద ఉండే బ్యాలెట్ యూనిట్‌లోకి వెళ్లి నిక్షిప్తమయ్యేది. ఇప్పుడు ఆ రెండింటి మధ్యకు వీవీప్యాట్‌లు వచ్చి చేరాయి. ఎప్పుడైనా, ఎవరైనా తాను వేసిన ఓటుపై ఓటరు అనుమానం వ్యక్తం చేస్తే వీవీ ప్యాట్ నుంచి ప్రింట్ అయిన కాగితాల ఆధారంగా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటును కల్పిస్తుంది.