KTR: చెప్పుతో కొట్టుకుంటావా..? డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ హస్తం కూడా ఉందని ప్రతిపక్ష, విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్నాయి.

  • Written By:
  • Updated On - December 21, 2022 / 09:16 AM IST

బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ హస్తం కూడా ఉందని ప్రతిపక్ష, విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా కేటీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తోన్నాయి. కేటీఆర్‌కు కూడా డ్రగ్స్ పరీక్షలు చేయాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీల విమర్శలపై కేటీఆర్ ఎట్టకేలకు స్పందించారు.

తాను డ్రగ్స్ టెస్టులకు సిద్దమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తన జుట్టు, గోర్లతో పాటు అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని, డ్రగ్స్ టెస్టులు చేయించుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్దమా? అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే బండి సంజయ్‌ను చెప్పుతొ కొడతానని, తన సవాల్‌ను ఆయన స్వీకరిస్తారా అంటూ ప్రశ్నించారు.

డ్రగ్స్ టెస్టు కోసం తాను ఎప్పుడైనా సిద్దమని, ఏది కావాలంటే అది ఇస్తానని కేటీఆర్ తెలిపారు. ‘డాక్టర్లను తీసుకొచ్చి డ్రగ్స్ టెస్ట్ చేయించండి బండి సంజయ్.. నాకు క్లీన్ చిట్ వస్తుంది. బండి సంజయ్ తన చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా’ అంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని, నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా ఆయన ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నారు. తన బ్యాంక్ డాక్యుమెంట్స్, తన కుటుంబసభ్యుల బ్యాంకు వివరాలతో విచారణకు హాజరువుతున్నారు.దీంతో మంత్రి కేటీఆర్‌కు కూడా త్వరలో డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.