తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion) ఉత్కంఠకు తెర వేసింది. కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముగ్గురు కొత్త మంత్రుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై నేరుగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దీంతో ముదిరాజ్, మాల, మాదిగ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?
అయితే ఈ విస్తరణలో కొందరు ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం జోరుగా సాగింది. ఆయనకు మంత్రి పదవి ఖరారైపోయిందని అనేక మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు కూడా వెలువరించాయి. కార్యకర్తలు సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆయనను పక్కన పెట్టి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి పదవి అప్పగించడం కవ్వంపల్లి వర్గంలో తీవ్ర అసంతృప్తిని రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన వర్గీయులు గట్టి భంగపాటుకు లోనయ్యారు.
Maganti Gopinath: ఎవరీ మాగంటి గోపినాథ్.. ఆయన రాజకీయ ప్రయాణం ఇదే!
కవ్వంపల్లికి మంత్రి పదవి రావడం ఖాయమని భావించిన పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడ్లూరిని సంప్రదించి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండమని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం మొదట కవ్వంపల్లి పేరును పరిశీలించినప్పటికీ, చివరి దశలో పార్టీలోని అంతర్గత సమీకరణాలు, సామాజిక సమతుల్యతల కారణంగా అడ్లూరికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కవ్వంపల్లి వంటి ఆశావహులకు భవిష్యత్‌లో అవకాశం ఇవ్వవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా, ప్రస్తుతం ఆయనకు ఎదురైన దెబ్బ తీవ్రంగానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి ప్రముఖ నేతలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, వారికి అవకాశం దక్కకపోవడం అసంతృప్తికి దారితీసింది. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న వీరికి మంత్రి స్థానం ఖాయం అనే ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో, చివరికి వారి పేర్లు తుది జాబితాలో లేకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
అటు ఎమ్మెల్సీలు అయిన అద్దంకి దయాకర్, విజయశాంతి వంటి సీనియర్ నేతల పేర్లు కూడా ప్రారంభంలో తెరపైకి వచ్చినప్పటికీ, వారికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. పార్టీలోనూ, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించగల సత్తా ఉన్న నేతలుగా వీరిని భావించినప్పటికీ, ఈ దఫా వారికి అవకాశం కల్పించకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పదవి ఆశించిన పలువురు నేతలు తాత్కాలికంగా వెనక్కి నెట్టబడినట్లయింది. ఈ నేతలందరికీ మరికొంత కాలం వరకు ఎదురుచూపులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ లోపల ఉండే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతలు, కొత్తవారికి అవకాశం కల్పించాలనే సంకల్పం కారణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తమవుతున్న వేళ, రాబోయే రోజుల్లో ఈ నేతలు ఎలా ఉంటారో అనేది ఆసక్తి గా మారింది.