Dilsukhnagar Bomb Blasts : హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న రెండు బాంబులు పేలాయి. ఈ పేలుడు 18 మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాటి నుంచి ఇప్పటిదాకా బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారంతా ఎదురు చూస్తున్న తుది తీర్పు దినం రానే వచ్చింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించబోతోంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read :Kadiyam Vs Palla : నేను విశ్వసంగా ఉండే కుక్కనే..నీలాగా గుంట నక్క కాదు – పల్లా రాజేశ్వర్ రెడ్డి
కేసులోని కీలక విషయాలివీ..
- ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక దర్యాప్తు చేశాయి. ఎన్నో ఆధారాలను సేకరించి, టెక్నికల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు.
- ఈ కేసులో మొత్తం 157 మంది సాక్షులుగా ఉన్నారు. వీరందరూ ఇచ్చిన వాంగ్మూలాలతో కేసు బలపడింది.
- దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు ఎదురుగా రద్దీగా ఉండే ప్రాంతంలో 150 మీటర్ల వ్యాసార్థంలో రెండు వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందుకోసం ఉగ్రవాదులు ఒక సైకిల్‌పై టిఫిన్ బాక్సులో బాంబులను పెట్టారు. అవి పేలడంతో భారీ ప్రాణనష్టం జరిగింది.
- ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందని గుర్తించారు.ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ (కర్ణాటక)ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు అసదుల్లా అఖ్తర్ (ఉత్తరప్రదేశ్), వకాస్, తెహసీన్ అఖ్తర్(బిహార్), ఎజాజ్ షేక్(మహారాష్ట్ర), సయ్యద్ మక్బూల్ ఈ కుట్రలో భాగమైనట్టు తేలింది.
- తొలుత ఈ కేసును ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. 2016లోనే కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ అప్పీల్‌పై హైకోర్టు తీర్పును ఇవ్వబోతోంది.
- యాసిన్ భత్కల్(Dilsukhnagar Bomb Blasts) ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
- యాసిన్ భత్కల్‌పై దాఖలు చేసిన చార్జిషీట్ల ప్రకారం.. 2008 అనంతరం భారత్‌లో జరిగిన కనీసం 10 బాంబు పేలుళ్లకు అతడు ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
- 2008లో న్యూఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, సూరత్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు, 2010లో వారణాసి, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పేలుళ్లు, 2011లో పుణె జన్మన్ బేకరీ, ముంబై పేలుళ్లు, 2013లో హైదరాబాద్ పేలుళ్లకు యాసిన్ భత్కల్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు అంటున్నారు.