Bhatti Vikramarka : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేగింది. ‘‘పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది’’ అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం సభ వేదికగా కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి’’ అని భట్టి విక్రమార్క ఈసందర్భంగా హితవు పలికారు. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో సభ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Also Read :Liquor Scandal : జగన్‌కు షాకిచ్చే నిర్ణయం దిశగా చంద్రబాబు సర్కారు
ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పందిస్తూ.. ‘‘కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి. లేదంటే సభకు వెంటనే క్షమాపణ చెప్పాలి’’ అని సవాల్ విసిరారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. మైకు ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడుతారని ఊహించాను. కానీ దారుణంగా మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసనకు దిగారు. ‘‘20 శాతం, 30 శాతం ప్రభుత్వం’’ అంటూ నినాదాలు చేశారు.
Also Read :KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?
దుర్మార్గమైన చట్టం ధరణి : భట్టి
అంతకుముందు అసెంబ్లీలో భూ భారతి అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది భూ భారతి కాదు.. అది భూ హారతి’’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జమాబందీ పేరుతో ప్రభుత్వం మరో దుకాణం తెరిచిందన్నారు. ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని కోరారు. రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పామని, అలాగే చేశామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.