హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్‌లో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గౌడవెల్లి నుంచి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Navi Mumbai: నవీ ముంబైలోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
రామంతాపూర్‌లో అగ్ని ప్రమాదం
మరోవైపు.. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రామంతాపూర్‌లోని ఓ ఫర్నీచర్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.