మరో రెండు రోజుల్లో దసరా సంబరాలు (Dussehra Celebrations) మొదలుకాబోతున్నాయి. తెలంగాణ (Telangana) లో దసరా సంబరాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల2వ తేదీ నుంచి బతుకమ్మ (Bathukamma) పండగ కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మొత్తం తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులకు మాంసాహారాన్ని కూడా ముట్టరు. తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకూ బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. బతుకమ్మ కోసం పూలను తెచ్చి తయారు చేసి ఆటపాటలతో గడుపుతారు.
ఇక దసరా రోజు తెలంగాణ అంత మందు , విందుతో ఉగిపోతుందని చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా దసరా ను జరుపుకుంటారు. ఇక దసరా వస్తుందంటే చాలు అనేక ఆఫర్లతో సంస్థలన్నీ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉంటాయి. ఇక పలు గ్రామాలలో బంపర్ ఆఫర్లు మొదలయ్యాయి. 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు, 100 రూపాయలు కొట్టు… మేకను పట్టు… లక్కీ డ్రా లో మీరివి గెలుచుకుంటారు అంటూ పెద్ద ఎత్తున గ్రామాలలో దసరా ఆఫర్లు నడుస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల, మర్రిగూడ తదితర మండలాలలో దసరా పండుగ సందర్భంగా కొందరు యువకులు 51 రూపాయలు కొట్టు మేకను పట్టు అని ప్రచారం విస్తృతంగా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దసరా సందర్భంగా పెట్టిన ఈ స్కీం లో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే ఆ కూపన్ల నుంచి డ్రా తీస్తారు.
డ్రాలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 12 కిలోల మేకను, రెండవ బహుమతిగా రెండు రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్స్, మూడో బహుమతిగా రెండు బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బాటిల్స్, నాలుగో బహుమతిగా రెండు కడకనాథ్ నాటు కోళ్లను, ఐదో బహుమతిగా ఒక కార్టన్ బడ్వైజర్ బీర్లను ఇచ్చేటట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీని ద్వారా ఆ ప్రాంతాల జనాల నుండి భారీగానే వసూలు చేస్తున్నారు.
లెంకలపల్లి, వెల్మకన్నె గ్రామాలలో దసరా ఆఫర్ గా 100 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకోండి.. దసరాకి ముందు డ్రా తీస్తామని చెప్తున్నారు. మొదటి బహుమతి 10 కిలోల మేక, రెండవ బహుమతి రెండు బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్స్, మూడవ బహుమతి ఒక కార్టన్ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదువ బహుమతి ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో దుమ్మురేపుతున్న ఈ ఆఫర్లు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారాయి.
Read Also : Rajya Sabha Offer : మెగా బ్రదర్ కు రాజ్యసభ సీటు ఖరారు..?