తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి దానం నాగేందర్ (Danam Nagender) వైఖరి ప్రస్తుతం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పీసీసీ, ఏఐసీసీ పిలుపులను విస్మరించడం, కాంగ్రెస్ పెద్దలపై విమర్శలు చేయడం, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది.తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం ఇలా బీఆర్ఎస్‌ను పొగడటం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు దారితీస్తోంది.
BSF Jawan : భారత జవానును బంధించిన పాకిస్థాన్
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, సీఎస్ శాంతికుమారి లపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. HCU భూముల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడిన దానం, ఓ హానెస్ట్ ఆఫీసర్‌కు అవమానం జరిగిందని చెప్పడం, అధికార యంత్రాంగాన్ని తప్పుబట్టడం ద్వారా రాజకీయ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెసును బ్లాక్‌మెయిల్ చేయడానికా? లేక మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేస్తున్నారా? అన్న చర్చ ఊపందుకుంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుండగా, దానం తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్‌లో చేరిన ఆయన, మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సంకేతాలు ఇస్తుండటం, ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందనే భయాన్ని బలపరుస్తోంది. అయితే తరుచూ పార్టీ మారే నేతలపై విశ్వాసం కలిగించలేమన్న వాదనలు బలపడుతున్నాయి. దానంను బీఆర్ఎస్ మళ్లీ అంగీకరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ప్రస్తుతం స్పష్టంగా కనిపించడం లేదు.