Hydra: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం తూముకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజల్ గ్రామంలోని దళిత వాడకు దారి దొరికింది. దళితవాడకు వెళ్లే దారులు మూసేస్తూ తిరుమల కాలనీ వెంచర్ నిర్వాహకులు నిర్మించిన ప్రహరీని హైడ్రా (Hydra) తొలగించడంతో దారులు ఏర్పడ్డాయి. దళితవాడకు వెళ్లేందుకు నలువైపుల నుంచి దారి గతంలో ఉండేదని.. 1985లో తిరుమల కాలనీ వెంచర్ రావడంతో తమకు దారులు మూసుకుపోయాయని దళితవాడ నివాసితులు పేర్కొన్నారు.
ఇదే విషయమై తాము సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఈ అవస్థలపై ఈనెల 17న హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2022 సంవత్సరం ఫిబ్రవరిలో ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని.. ఈ మేరకు కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని అక్కడి నివాసితులు ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దారులు బంద్ కావడంతో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు దళితవాడకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని.. తాము కూడా చుట్టూ తిరుగుతూ ద్విచక్ర వాహనాలలో మాత్రమే వెళ్లేవారమని వాపోయారు.
Also Read: Global Whisky Competitions: ప్రపంచ విస్కీ అవార్డులలో భారతీయ విస్కీదే పైచేయి!
ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు.. దళితవాడకు వెళ్లే దారుల్లో ఆటంకాలు కలగకుండా చూడాలని.. అక్కడ అడ్డుగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తిరుమల వెంచర్ నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది. దీంతో దళితవాడకు దారి దొరికిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో గర్భిణీ స్త్రీలతో పాటు.. అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని తాము బయటకు మోసుకువచ్చి అంబులెన్సు ఎక్కించేవాళ్లమని.. ఇప్పుడు దారులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యిందని దళితవాడవాసులు పేర్కొన్నారు.