Site icon HashtagU Telugu

Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్‌

Cyber crime

Cyber crime

Hyderabad Cybercrime Police: ప్ర‌స్తుతం దేశంలో సైబ‌ర్ క్రైమ్‌లు తీవ్ర స్థాయిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఏదో ఒక కొత్త స్కామ్‌తో సైబ‌ర్ నేరగాళ్లు సామాన్యుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ల‌క్ష‌ల్లో డబ్బును దోచుకుంటున్నారు. సైబ‌ర్ మోసాల ప‌ట్ల కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న అవి కొంత‌మేర‌కు సైబర్ మోసాల బారిన ప‌డ‌కుండా కాపాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cybercrime Police) భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన విజ‌య‌వంత‌మ‌య్యారు.

రూ. 5.29 కోట్ల మోసాలకు పాల్పడ్డ 23 మంది సైబర్ నేరగాళ్లను ప‌థ‌కం ప్రకారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ సైబర్ చీటర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవ‌లం తెలంగాణలో వీరిపై 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 328 కేసుల్లో ఈ 23 మంది నిందితులుగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఏపీకే, జాబ్ ఫ్రాడ్ కేసుల్లో ఈ 23 మంది నేర‌గాళ్లు మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు హైద‌రాబాద్‌ సైబర్ క్రైం డీసీపీ క‌విత వెల్ల‌డించారు.

Also Read: Robin Uthappa: యువ‌రాజ్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది కోహ్లీనే.. ఉత‌ప్ప సంచ‌ల‌నం!

ఈ సంద‌ర్భంగా డీసీపీ క‌విత మాట్లాడుతూ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం రూ. 5.29 కోట్ల రూపాయలు దోచుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాం. అక్కడి స్థానిక పోలీసుల సాయంతో అధునాతన టెక్నాలజీని వాడి నిందితులను పట్టుకున్నాం. ఇటీవల సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న సొమ్మును మూడు కేసుల్లోనే రూ. 39 లక్షలు రీఫండ్ చేశాం. అనుమానాస్పద లావాదేవీల విషయంలో ఓ కేసులో 70 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదులో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఢిల్లీలో ఎన్జీవోని రన్ చేస్తుంది. డబ్బులకు ఆశపడి ఆ ఎన్జీవో ఖాతాను సైబర్ నేరగాళ్లకు ఇచ్చింది. బాదితురాలి సొమ్ము ఆ ఖాతాలో క్రెడిట్ అయిందని తెలుసుకుని ప్రత్యేక బృందం ఆమెను అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు పది మంది లాయర్లు ఆమె కోసం వాదించారు. డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క‌వితి పేర్కొన్నారు.