Bomb Threats : మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇప్పటివరకు విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) స్కూళ్లకు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు సందేశాలు అందాయి., ఈ విషయం ఆలస్యంగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా స్కూళ్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ స్కూళ్ల పరిసరాల్లో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. సోమవారం అర్ధరాత్రి ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలకు 2 బెదిరింపు మెసేజ్‌లు, హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలకు ఒక బెదిరింపు మెసేజ్ వచ్చాయని అధికారులు గుర్తించారు. ఈమెయిల్ ద్వారా ఆయా స్కూళ్ల నిర్వాహకులకు ఈ వార్నింగ్ మెసేజ్‌లను(Bomb Threats) దుండగులు పంపారు.
Also Read :Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్‌ఐసీకి.. ఎందుకంటే ?
అంతకుముందు ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతం ప్రశాంత్ విహార్ ఏరియాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో భారీ పేలుడు సంభవించింది. దానికి తామే కారణమని ఖలిస్తానీ ఉగ్రవాదులు టెలిగ్రాం వేదికగా ప్రకటించుకున్నారు. ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజీని సేకరించి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు.. అంతకుముందు రోజు (శనివారం) అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూలు వద్ద అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో పేలుడు తమ పనే అని ప్రకటించిన సోషల్ మీడియా అకౌంటు సమాచారాన్ని అందించాలంటూ టెలిగ్రాంకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఈ ప్రకటన చేసిన ఖలిస్తానీ వేర్పాటువాదుల సమాచారాన్ని సేకరించిన తర్వాత.. వారి మూలాలను తెలుసుకోవడంపై భారత దర్యాప్తు విభాగాలు ఫోకస్ చేయనున్నాయి.