తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం హైదరాబాద్ నగరం సాంప్రదాయ, సాంకేతిక హంగులతో అద్భుతంగా ముస్తాబవుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ అంశాలను, తెలంగాణ ప్రత్యేక ఆకర్షణలను మేళవించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పెట్టుబడుల పండుగ వాతావరణాన్ని సృష్టించేందుకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన ప్రదేశాలలో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా, చార్మినార్ మరియు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్లు ఏర్పాటు చేసి, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని అతిథులకు చూపించనున్నారు. అలాగే, సచివాలయం వద్ద త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి తీరును, తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలను ఆకర్షణీయంగా ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
Sleeping Habits: రాత్రిళ్లు ముఖానికి దుప్పటి కప్పుకొని నిద్ర పోతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఈ సమిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనలు వేడుక వైభవాన్ని కళ్లకు కట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి, అందులో సమిట్ లోగోను ప్రదర్శించనున్నారు. ఇక, హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు కానున్న వాటర్ ప్రొజెక్షన్ ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత-రైతు ప్రధాన కార్యక్రమాలు, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం వంటి కీలక అంశాలను ప్రదర్శించనున్నారు. అతిథులను వేదిక వద్దకు ఆహ్వానించడంలో భాగంగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే మార్గంలో భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, మార్గ వివరాలను ప్రదర్శిస్తున్నారు. అంతేకాక, నగరం నలుమూలలా సమిట్ లోగోలతో తయారు చేసిన 1,500 రంగురంగుల జెండాలు రెపరెపలాడనున్నాయి. సమిట్‌కు సంబంధించిన సమాచారం అందించడానికి 10 వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో 50 మీటర్ల పొడవుతో, త్రీడీ డిజైన్లతో, ఇంటరాక్టివ్ డిస్‌ప్లే రూపంలో ముస్తాబైన డిజిటల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సమిట్‌కు చేరుకోవాలంటే అతిథులు ఈ సొరంగం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమిట్‌కు ఆహ్వానాల విషయంలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించగా, మంత్రి వాకిటి శ్రీహరి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్హిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ సమిట్‌ను విజయవంతం చేయడానికి అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను కూడా నియమించారు.
