Bhu Bharati: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘భూభారతి’ పేరుతో రెవెన్యూ వ్యవస్థను రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా భ్రష్టుపట్టించిందని ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన, అక్కడ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు.
హరీష్ రావు మాట్లాడిన ప్రధాన అంశాలు ఇవే
పెండింగ్‌లో లక్షలాది దరఖాస్తులు
రెవెన్యూ సదస్సుల పేరిట రైతుల నుంచి 8.68 లక్షల దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం, పది నెలలు గడుస్తున్నా వాటిని పరిష్కరించకుండా చెత్తబుట్టలో వేసిందని మండిపడ్డారు. ధరణి ఉన్నప్పుడు వారం రోజుల్లో వచ్చే పాస్ బుక్కులు, ఇప్పుడు ఆరు నెలలైనా రావడం లేదని విమర్శించారు. పాస్ బుక్ ఫీజు కింద రూ. 300 వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
సాదా బైనామాలకు కొర్రీలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.2 లక్షల మందికి ఉచితంగా సాదా బైనామాలు చేసిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ‘అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలి’ అనే కొత్త నిబంధన తెచ్చి సాదా బైనామా ప్రక్రియకు ఉరితాడు బిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఒక్క రైతుకు కూడా పని జరగడం లేదని అన్నారు.
Also Read: జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. టీ20 వరల్డ్ కప్‌లో రెండో అత్యధిక స్కోరు!
భూముల నిషేధిత జాబితా- రియల్ దందా
నిషేధిత భూముల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టకుండా దాచిపెడుతున్నారని, నిషేధిత భూములను కోటి ఎకరాలకు పెంచేసి కాంగ్రెస్ నేతలు రియల్ దందా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు. ప్రజలు తమ అత్యవసరాల కోసం భూమి అమ్ముకోలేక గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ పేరిట వసూళ్లు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు అధికారం రాగానే ప్రజల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
రెవెన్యూ శాఖలో అవినీతి
మంత్రి కుమారుడే భూ కబ్జాలకు పాల్పడుతుంటే అడిగే నాథుడే లేడని, కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. భూమిని కాపాడిన పోలీసు అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చనిపోయిన వీఆర్ఓల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, 4 వేల మంది వీఆర్ఏ వారసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
