Medigadda Bridge : మేడిగడ్డ బ్యారేజీ ఏడో నెంబర్ బ్లాక్‌లో 19 నుంచి 21 పిల్లర్ల మధ్య బ్రిడ్జి కుంగిపోయిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ ఫిర్యాదు మేరకు మహదేవ్‌పూర్ పోలీసులు కుట్ర, విద్రోహ చర్య అభియోగాలతో కేసును నమోదు చేశారు. శనివారం సాయంత్రం పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చినందున.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చనే అనుమానం తమకు కలిగిందని రాతపూర్వక ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. విద్రోహచర్యతో ఎవరైనా పేలుడుపదార్థం పెట్టి ఉంటారనే డౌట్ తమకు ఉందని రవికాంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రతో ఇలా చేసి ఉంటారని ఫిర్యాదు లేఖలో తెలిపారు. భారీ శబ్దం వచ్చేంతవరకూ బ్రిడ్జిమీద వాహనాల రాకపోకలు యధావిధిగానే జరిగాయని గుర్తు చేశారు.
శనివారం సాయంత్రం 6.20 గంటలకు..
‘‘శనివారం సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్దం వచ్చింది. ఆ వెంటనే ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఫోర్‌మాన్ బిద్యుత్ దేబ్‌నాధ్‌తో కలిసి ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళి చూశాం. ఏడో నెంబర్ బ్లాక్‌లో 19-21 పిల్లర్ల మధ్య ప్రాంతంలో బ్యారేజీ మీద ఉన్న రోడ్డు బ్రిడ్జి శ్లాబ్, పిట్టగూడ కుంగిపోయినట్లు గమనించాం. ఈ ఘటన మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో చోటుచేసుకుంది’’ అని ఫిర్యాదులో రవికాంత్ వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 427, పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణకు ప్రత్యేక బృందాలను(Medigadda Bridge) ఏర్పాటు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన కేంద్ర కమిటీ
మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం ఉదయం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు నిపుణుల కమిటీ సందర్శించింది. సుమారు రెండు గంటల పాటు కుంగిన 20వ పిల్లర్ తో పాటు 18, 19, 21వ పిల్లర్లను పరిశీలించింది. పగుళ్లు వచ్చిన డ్యాం, క్రస్ట్ గేట్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు.. బ్యారేజీ డిజైన్, నిర్మాణం వివరాల రికార్డులను రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల నుంచి తీసుకున్నారు. కేంద్రం బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది.
Also Read: SSB Jobs : 111 ఎస్‌ఐ జాబ్స్.. డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ డిప్లొమాతో ఛాన్స్