జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ కేటాయింపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో చిన్న స్థాయిలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకమాండ్ ఈ స్థానానికి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో అంజన్ కుమార్ నిరాశకు గురయ్యారు. ఆయన అసహనం పార్టీ లోపల అసంతృప్తి వాతావరణాన్ని కలిగించడంతో, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అతన్ని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు.
Heavy Rains : మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!
అంజన్ కుమార్ యాదవ్ నివాసం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండగా, ఆయనను కలవడానికి మంత్రి వివేక్ వెంకట్ స్వామి , పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ కూడా ఆయనను కలిసి చర్చించారు. పార్టీ పట్ల నిబద్ధతను కొనసాగించాలని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవించాలని వారు అంజన్ కుమార్‌ను కోరినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అంజన్ కుమార్‌ను వ్యక్తిగతంగా కలవనున్నారు. పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని కాపాడటానికి, అసంతృప్తి దూరం చేసేందుకు ఈ భేటీ కీలకంగా భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర నిరాశలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు భవిష్యత్తులో తగిన బాధ్యతలు ఇస్తుందనే సంకేతాలు అందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంజన్ కుమార్, హైదరాబాదులో మైనార్టీ మరియు బీసీ వర్గాల్లో ప్రభావం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన అసంతృప్తి పార్టీకి నష్టం కలిగించకుండా ఉండేందుకు హైకమాండ్ దౌత్యంగా వ్యవహరిస్తోంది. మీనాక్షి నటరాజన్ భేటీ అనంతరం పరిస్థితులు సాధారణం కానున్నాయని, అంజన్ కుమార్‌ను మళ్లీ చురుకైన రాజకీయ పాత్రలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలుస్తోంది.

