Congress: `టీ కాంగ్రెస్` ను సెట్ చేసిన అమెరికా బిలియ‌నీర్?

అమెరికా నుంచి ఆంధ్రా, తెలంగాణ రాజ‌కీయాలను ప్ర‌భావితం చేసే ప్ర‌ముఖులు కొంద‌రు ఉన్నారు.

  • Written By:
  • Updated On - June 13, 2022 / 12:55 PM IST

అమెరికా నుంచి ఆంధ్రా, తెలంగాణ రాజ‌కీయాలను ప్ర‌భావితం చేసే ప్ర‌ముఖులు కొంద‌రు ఉన్నారు. వాళ్ల డైరెక్ష‌న్లో న‌డిచే పార్టీలు కూడా లేక‌పోలేదు. పెద్ద ఎత్తున నిధుల‌ను స‌మ‌కూర్చే అమెరికా పారిశ్రామిక‌వేత్త‌లు ఆయా పార్టీల‌కు కొంద‌రు ఉన్నారు. అంతేకాదు, వాళ్ల ద్వారా రాజ‌కీయ ఆప‌రేషన్స్ కూడా చాలా సంద‌ర్భాల్లో ఏపీ, తెలంగాణ‌లో జ‌రిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. అమెరికాలోని తెలుగు బిలియ‌నీర్ల ఆశీస్సుల కోసం వివిధ పార్టీల‌కు చెందిన అధిప‌తులు త‌ర‌చూ అక్క‌డికి వెళుతుంటారు. ఆ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌తో పాటు రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేయ‌డానికి అర్థ‌బ‌లాన్ని అమెరికాలోని బిలియ‌నీర్లు ఇస్తారు. సామాజిక‌వ‌ర్గాల వారీగా బిలియ‌నీర్ల ప్ర‌మేయం ఆయా పార్టీల మీద ఉంది.

అమెరికాలోని ఒక బిలియ‌నీర్ ఏపీకి చెందిన `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పారిశ్రామిక‌వేత్త‌. ఆయ‌న చాలా కాలంగా పార్టీల‌కు భారీగా విరాళాలు ఇస్తుంటారు. అంతేకాదు, తెలుగువాళ్లు అమెరికాలో ఏర్పాటు చేసుకున్న స్వ‌చ్చంధ సంస్థ‌ల‌కు భూరివిరాళాలు ధార‌ళంగా ఇస్తుంటార‌ని ఎన్నారైల‌కు తెలుసు. సుమారు 25 రాష్ట్రాల్లో ఆయ‌న కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న వ‌ద్ద నుంచి భారీగా 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి కూడా విరాళాలు అందాయ‌ని టాక్‌. ఏపీలో `రెడ్డి`ల‌కు రాజ్యాధికారం తీసుకురావ‌డానికి అన్ని ర‌కాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. ఇప్పుడు తెలంగాణ‌లోనూ `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం అధికారంలోకి రావ‌డానికి అన్ని ర‌కాల స‌హాయ స‌హకారాలు అందివ్వ‌డానికి సిద్దం అయ్యార‌ట‌. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట‌లు లేకుండా చేసే ప్ర‌య‌త్నం అమెరికా కేంద్రంగా ఆయ‌న చేశార‌ని తెలుస్తోంది. అందుకే, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఒకే వేదిక‌పై త‌ర‌చూ క‌నిపిస్తున్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాబోవు రోజుల్లో కూడా పొర‌పొచ్చాలు ఉండ‌కుండా ఆ బిలియ‌నీర్ స‌యోధ్య కుదిర్చార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బ‌ల‌ప‌డుతోంది. అధికార ప‌క్షానికి ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంద‌న్న విష‌యాన్ని అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే, కేసీఆర్ ను గ‌ద్దె దించ‌డానికి జేఏసీగా కూడా కొంద‌రు ఏర్ప‌డ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ‌కు వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే సీఎం ఎవ‌రు కావాలి? అనే ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు ఆ బిలియ‌నీర్ ఎంట్రీ ఇస్తారంట‌. అప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేయాలని కండిష‌న్ ఇద్ద‌రి మీద పెట్టార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్టార్ క్యాంపెయిన‌ర్ గా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ కాంగ్రెస్ పార్టీని దూకుడుగా తీసుకెళుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు కోమ‌ట‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి , జానా రెడ్డి రూపంలో బ్రేక్ లు ప‌డుతున్నాయి. అందుకే, ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎలాంటి బ్రేక్ లు రేవంత్ రెడ్డికి లేకుండా అమెరికాలోని బిలియ‌నీర్ తాత్కాలికంగా పంచాయితీ చేశార‌ట‌.

ఏపీలో రెడ్డి సామాజికవ‌ర్గానికి రాజ్యాధికారం తీసుకురావ‌డంలో తెర‌వెనుక అమెరికా నుంచి కీ రోల్ పోషించిన ఆయ‌న ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టారు. కొన్ని వేల మంది ఎన్నారైలు ఆయ‌న ఆస్ప‌త్రుల్లో ప‌నిచేస్తుంటారు. పారిశ్రామిక‌వేత్త‌గా ఆయ‌న ఎంతో మంది ఎన్నారైల‌కు స‌హాయం చేశారు. ఆయ‌న నీడ‌న బ‌తుకుతున్న‌ వాళ్లు ప‌లువురు. ఉన్నారు. వాళ్ల ద్వారా చాప‌కింద నీరులా అమెరికా నుంచి ఆయ‌న తెలంగాణ రాజ‌కీయాల‌ను `రెడ్డి` సామాజిక‌వ‌ర్గానికి అనుకూలంగా న‌డిపే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టార‌ని స‌మాచారం. అందుకే, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల మ‌ధ్య పొర‌పొచ్చాలు ఉండ‌వ‌ని తెలంగాణ ఎన్నారైలు కొంద‌రు చెబుతున్నారు. ఏఐసీసీ చేయ‌లేని ప‌నిని అమెరికా బిలియ‌నీర్ తెలంగాణ కాంగ్రెస్ ను సెట్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంత వ‌ర‌కు ఆయ‌న ప్ర‌య‌త్నం తెలంగాణ‌లో ఫ‌లిస్తుందో చూడాలి.