Site icon HashtagU Telugu

Telangana Congress : అటు చూస్తే అప్పులు.. ఇటు చూస్తే వాగ్దానాలు..

Congress Party In Telangana, If You Look At The Debts.. If You Look At The Promises..

Congress Party In Telangana, If You Look At The Debts.. If You Look At The Promises..

By: డా. ప్రసాదమూర్తి

Telangana Congress : అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దీని ద్వారా యావత్తు తెలంగాణ (Telangana) ప్రజానీకానికి ఒక విషయం అర్థమైంది. గత పదేళ్లుగా పరిపాలించిన ప్రభుత్వం ఏం చేసిందో గానీ దాదాపు 7 లక్షల కోట్ల అప్పు మాత్రం మిగిల్చిందని ఆ శ్వేత పత్రం సాక్షిగా తేటతెల్లమైపోయింది. ఇటు చూస్తే ఇంత దారుణమైన అప్పుల అగాథంలో రాష్ట్రం కూరుకుని ఉంది. అటు చూస్తే ఎన్నికల ముందు తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రతిపక్షం గర్జిస్తోంది. తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇదొక విషమ సమస్యగా పరిణమించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంపు అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ మహిళలు కింది తరగతి శ్రామిక వర్గ మహిళలు కళ్లనిండా ఆనందపు వెలుగులు నింపుకొని ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈ కానుక పట్ల ఎంతో సానుభూతి ప్రకటిస్తున్నారు. రైతుల రుణమాఫీ, గ్యాస్ సిలిండర్ ల మీద సబ్సిడీ, మహిళలకు అకౌంట్లో డబ్బులు వేయడం లాంటి కొన్ని వాగ్దానాలు అమలుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇది ఇలా ఉంటే రాష్ట్రాన్ని ఇంత అప్పులపాలు చేసి, చేపట్టిన ప్రతి ప్రాజెక్టు చుట్టూ అవినీతి గోడలు కట్టి ఆగమాగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం అందరికీ అర్థమవుతుంటే, వాటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎప్పుడెప్పుడు వాగ్దానాలు అమలు చేస్తారని ఒకటే కాకి గోల చేస్తూ విరుచుకుపడుతున్నారు. చేసిన వాగ్దానాలు అమలు చేయాలని పట్టు పట్టడం డిమాండ్ చేయడం దానికోసం తమ నిరసన వ్యక్తం చేయడం ప్రతిపక్షం బాధ్యత. ఆ బాధ్యతను నిర్వహించడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సమస్త వాగ్దానాలను అమలు చేయాలని పట్టు పట్టడం చూస్తే బీఆర్ఎస్ నాయకుల్లో ఏదో భయం వణుకు పట్టుకున్నట్టు అనుమానించాల్సి వస్తుంది. రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో నిజాన్ని నిగు తేలుస్తామని ప్రభుత్వం నడుం బిగించింది.

ఎక్కడ తమ పాపాల పుట్ట బద్ధలవుతుందో, తమ ఆర్థిక నేరాలు అవినీతి ఘోరాలు ఎక్కడ బట్టబయలై తమ భవిష్యత్తు అంధకారం పాలవుతుందోనని బీఆర్ఎస్ నాయకులు భయపడుతూ, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, గత ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే కాస్త కాలక్షేపం చేయవచ్చునని ప్రయత్నిస్తున్నట్టుగా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత ఊపిరి పీల్చుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా ఇలా ఎదురుదాడికి దిగుతున్న బీఆర్ఎస్ నాయకుల నిజాయితీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చాలా అనుమానాలు కూడా కలిగే అవకాశం ఉంది.

Also Read:  JN.1 Variant: విజృంభిస్తోన్న కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1.. మాస్క్ మస్ట్..!

ఎన్నో వాగ్దానాలు చేసి గతంలో టిఆర్ఎస్ నాయకులు అధికారంలోకి వచ్చారు. ప్రతి దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ వాగ్దానాలు ఏవీ అమలు కాలేదు. తాము చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి 10 సంవత్సరాలైనా సమయం చాలని నాయకులకు కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులైనా కాకుండా ఇలా వాగ్దానాలు అమలు కోసం డిమాండ్ చేయడం ఎంత నీతిమంతమైంది అనే ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది. వాస్తవానికి ఎన్నికల్లో జరిగిన ప్రత్యర్థి పార్టీల మధ్య యుద్ధం కంటే అసలు యుద్ధం ఏదో ఇప్పుడు ప్రారంభమైనట్టుగా ఉంది.

ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిధులను సమకూర్చుకోవాలి. మరోపక్క అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. అంతేకాదు రాష్ట్రాన్ని మిగులు ఆదాయం దిశగా ముందుకు నడిపించి దేశంలోని సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దాలి. ఇంతటి బృహత్తరమైన కర్తవ్యం ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంది. మరి ఎంత నిబద్ధతతో నిజాయితీతో దీక్షతో కాంగ్రెస్ నాయకులు పనిచేస్తారో కాలమే చెప్పాలి. వారి పని విధానం మీద వారి నిజాయితీ మీద మాత్రమే రానున్న సార్వత్రిక ఎన్నికలలో వారి పట్ల ప్రజల తీర్పు ఉంటుంది అన్న వాస్తవాన్ని కూడా గమనించాలి. దీనితోపాటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్ర అభివృద్ధి విషయంలో అధికారపక్షాలతో కలిసి కట్టుగా పనిచేయాలి. లేదంటే ప్రజలు ఎన్నికల్లో మాత్రమే కాదు ఎన్నికల అనంతరం కూడా ఛీ కొడతారు.

Also Read:  CM Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం వాయిదా.. కారణమిదే..?